తెలుగు సినిమాని తక్కువ చేసి చూసేది ఒకటి కోలీవుడ్, ఇంకోటి బాలీవుడ్. కానీ రాజమౌళి పుణ్యమా అని ఆ మచ్చ తొలగిపోయింది. హిందీలో మన తెలుగు సినిమాలు బాగా ఆడుతున్నాయి. కొన్ని తెలుగు సినిమాలు అయితే హిందీలోనే భారీ వసూళ్లు సాధిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కోలీవుడ్ ఆడియన్స్ మాత్రం మన తెలుగు సినిమాలను తక్కువ చేసి చూస్తూనే ఉన్నారు. రాజమౌళి సినిమాలు తప్ప మిగతా పెద్ద సినిమాలేవీ కూడా తమిళంలో ఆడటం లేదు. ఒకవేళ అక్కడి పెద్ద హీరోలతో కనుక మన దర్శకులు సినిమాలు చేస్తే..వాటిని కూడా చూడటం లేదు.
తెలుగు సినిమాని కానీ, తెలుగు సినిమా హీరోలను కానీ తమిళ జనాలు అంతలా తక్కువ చేసి చూస్తున్నారు అని ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ మన పెద్ద హీరోలు కానీ, పెద్ద దర్శకులు కానీ ఈ విషయం పై ఓపెన్ అవ్వరు. మొన్నటికి మొన్న వచ్చిన ‘కుబేర’ సినిమాని సైతం అక్కడి జనాలు చూడలేదు. అంతకు ముందు ధనుష్ చేసిన ‘సార్’ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ దర్శకులు వెంకీ అట్లూరి కానీ, శేఖర్ కమ్ముల కానీ ఈ విషయం పై ఓపెన్ అవ్వలేదు.
అయితే ఎట్టకేలకు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ఓపెన్ అయ్యాడు. ప్రదీప్ రంగనాథన్ వంటి ముక్కు, మొహం తెలియని హీరోల సినిమాలకి కూడా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతున్నాయి. కానీ తమిళనాడులో తన ‘క’ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నిస్తే.. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఇంట్రెస్ట్ చూపలేదట. అదే టైంకి తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ రిలీజ్ అయ్యింది. దానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు కేటాయించారు.
అందువల్ల ‘క’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ థియేటర్లు దక్కలేదంటూ తన బాధని బయటపెట్టాడు. కిరణ్ చేసిన ఈ కామెంట్స్.. పూర్తిగా అతని ఎక్స్పీరియన్స్ అని సరిపెట్టుకోవడం కరెక్ట్ కాదు. మన తెలుగు డిస్ట్రిబ్యూటర్లు, మేకర్స్ కూడా కోలీవుడ్ ని నెత్తిన పెట్టుకోవడం మానేసి తెలుగు హీరోలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది.