‘అపజయాలు కలిగిన చోటే గెలుపు కేక వినిపిస్తుంది.. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది..’ అంటూ నా ఆటోగ్రాఫ్ చిత్రంలోని మౌనంగానే ఎదగమని అనే పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఇలాంటి సినిమా పాటల వల్ల ఆత్మహత్యను విరమించుకొని విజయాన్ని అందుకున్నవారు చాలామంది ఉన్నారు. ఈ పాటని ప్రేక్షుకులకు అందించిన స్టార్స్ మాత్రం లక్షచేధనలో ఓడిపోయి రాలిపోతున్నారు. కెరీర్ లో అడ్డంకులు ఎదుర్కోలేక కొందరు.. కుటుంబ కలహాలను పరిష్కరించుకోలేక మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రీల్ లైఫ్ లో హీరోగా అనిపించుకున్నప్పటికీ.. రియల్ లైఫ్ లో జీరోలు అవుతున్నారు. బలవన్మరణానికి పాల్పడిన సినీ నటీనటులపై ఫోకస్..
రంగనాథ్ (19 – 12 – 2015 )సీనియర్ నటుడు రంగనాథ్.. ఆనాటి హీరోలతో కలిసి 300కుపైగా తెలుగు చిత్రాల్లో నటించారు. అనేక పాత్రలు పోషించిన ఆయన నిజ జీవితంలో ఒంటరి పాత్రను పోషించలేకపోయారు. 2009లో భార్య మరణించిన తర్వాత హైదరాబాద్ గాంధీనగర్‌లో ఒక్కరే నివాసం ఉండేవారు. ఆ ఏకాంతం భరించలేక ప్రాణాలు తీసుకున్నారు.
ఉదయ్‌కిరణ్ (07 -01 – 2014 )సినీ కుటుంబం నుంచి కాకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ హిట్ అందుకున్న నటుడు ఉదయ్ కిరణ్. వరుసగా అపజయాలు పలకరించడం.. వ్యక్తిగతంగా కొన్ని సమస్యలతో పోరాడలేక సూసైడ్ చేసుకున్నారు.
భార్గవి (16 – 12 – 2008 )అష్టాచెమ్మా ఫేం భార్గవి తక్కువ కాలంలోనే నటిగా నిరూపించుకుంది. అయినా అనుమానాస్పదంగా మృతి చెందింది.
ప్రదీప్‌కుమార్ ( 03 – 05 – 2017 )టీవీ సీరియల్స్ లో నిత్యం గొడవలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్‌కుమార్.. నిజ జీవితంలో గొడవలను తట్టుకోలేకపోయారు. హైదరాబాద్ అల్కాపురిలో ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో జరిగిన చిన్న గొడవను సీరియస్‌గా తీసుకుని క్షణికావేశానికి లోనయ్యారు.
విజయ్‌సాయి (11 – 12 – 2017 )నటుడిగా ఎదగాలనే తపనతో విజయ్‌సాయి హైదరాబాద్ చేరుకుని సినీ పరిశ్రమలో మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పదేళ్లపాటు సినీ పరిశ్రమలో జయాపజయాలను చూసిన అతను నిజ జీవితంలో ఓడిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య విడాకులు కోరడం… కూతురిని కలవలేకపోవడం.. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నారు.
అన్ని రంగాల్లోనూ విజయాలు.. అపజయాలు ఉంటాయి. ఓటమి పలకరించినప్పుడు కుంగి పోకుండా
దాన్ని ఓ గుణపాఠం అనుకుని మరో విజయానికి నాంది పలకాలి. ఆత్మహత్య చేసుకోకూడదు. ఏదైనా సమస్యతో సతమవుతున్నప్పుడు తమతో చెబితే పరిష్కారం చూపుతామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా చెప్పారు.