ప్రేమ జంట రానా, మిహీకాల పెళ్లి పై రోజుకో వార్త ప్రచారం అవుతుంది. తాజాగా ఈ జంట తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారన్న వార్త గట్టిగా వినిపిస్తుంది. కరోనా వైరస్ అంతకంతకు పెరిగిపోతున్న తరుణంలో అనుకున్న సమయాని కంటే కొన్ని నెలలు వెనక్కి జరపాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఐతే ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. రానా, మిహీక బజాజ్ వివాహం వాయిదా పడలేదు, అనుకున్న ప్రకారం ఆగస్టు లోనే జరగనుంది అని కుటుంబ సభ్యులు స్పష్టత ఇచ్చారు.
గత నెలలో రోకా వేడుక జరుపుకున్న ఈ జంట ఆగస్టు 8వ తేదీన పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అనుకున్న ప్రకారమే వీరి పెళ్లి ఆరోజునే జరగనుంది. ఇక అప్పటికి కూడా సాధారణ పరిస్థితులు ఏర్పడని నేపథ్యంలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఆంధ్రా మరియు నార్త్ ఇండియన్ సాంప్రదాయాలలో ఈ పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులు ఈ పెళ్లి ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం.
మరో వైపు రానా కొన్ని చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయాల్సివుంది. తెలుగులో విరాటపర్వం మూవీలో నటిస్తున్న రానా ఆ చిత్ర షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 15నుండి కొత్త చిత్రాల షూటింగ్ మొదలుకానున్న నేపథ్యంలో మొదట విరాటపర్వం చిత్ర షూటింగ్ లో రానా పాల్గొననున్నారు. మరో వైపు గుణశేఖర్ హిరణ్య కశిప అనే భారీ పౌరాణిక చిత్రం రానాతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.