ఈటీవీలో ఒకే రోజు నుంచి రెండు కొత్త సీరియల్స్ టెలికాస్ట్ కాబోతున్నాయి. వసంత కోకిలతో పాటు కాంతార సీరియల్స్ జూలై 2 నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వసంత కోకిల సీరియల్ మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు ఈటీవీలో టెలికాస్ట్ కాబోతోంది. కాంతార సీరియల్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రసారం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఈటీవీ ఈ రెండు సీరియల్స్‌ను చూడొచ్చు.
వసంత కోకిల కథ ఇదే.
సంధ్య అందం, తెలివితేటలు కలిగిన అమ్మాయి. సూర్యాన్ని పెళ్లి చేసుకున్న సంధ్య ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. విధి కారణంగా పెళ్లి జరిగిన కొద్ది రోజులకే సూర్యం కన్నుమూస్తాడు.
భర్తకు ఇచ్చిన మాటకు కట్టుబడి సూర్య తల్లిదండ్రులు మాధవరావు, లక్ష్మీలను తన సొంత అమ్మనాన్నలుగా ప్రేమగా చూసుకుంటుంది సంధ్య. కోడలిని తమ కూతురిగానే భావిస్తుంటారు మాధవరావు, లక్ష్మి. ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. సంధ్య మాత్రం రెండో పెళ్లి అంగీకరించదు. తన మనసులో సూర్యానికి తప్ప మరొకరికి చోటు లేదని అంటుంది.
ఆకాశ్ ఎంట్రీ…
అలాంటి సంధ్య జీవితంలోకి అనుకోకుండా ఆకాశ్ వస్తాడు. సంధ్యను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాలని ఆశపడతాడు. సంధ్య కోసం మాధవరావు, లక్ష్మీలతో ఆకాష్ స్నేహంగా ఉండటం మొదలుపెడతాడు.
ఆకాష్ ప్రేమ విషయం సంధ్యకు తెలిసి ఏం చేసింది? అతడి ప్రేమను తిరస్కరించిందా? అంగీకరించిందా? ఇదివరకు సంధ్యకు సూర్యంతో పెళ్లి జరిగిందనే నిజం తెలుసుకున్న తర్వాత కూడా ఆకాష్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడా? లేదా అన్నదే ఈ సీరియల్ కథ. వసంత కోకిల సీరియల్ సంధ్య పాత్రలో పద్మ లక్ష నటిస్తోండగా ఆకాష్‌గా రవి రాథోడ్, సూర్యం క్యారెక్టర్‌లో మధు కనిపించబోతున్నారు. ఈ సీరియల్‌కు అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణ్ కుమార్ స్క్రీన్‌ప్లే సమకూర్చుతున్నాడు.
కాంతార సీరియల్
బుట్టాయ గూడేనికి చెందిన కాంతార, గోపి ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించిపెళ్లి పీటలు ఎక్కాలని ఆశపడతారు. కానీ అనుకోని పరిస్థితుల్లో యువరాజు తో కాంతార పెళ్లి జరుగుతుంది. గోపిని కాదని యువరాజును కాంతార ఎందుకు పెళ్లి చేసుకున్నది.
ప్రియురాలికి మరో యువకుడితో పెళ్లి జరిగిందనే నిజం తెలిసి గోపి ఏం చేశాడు. మనసుకు మాంగల్యానికి మధ్య కాంతార ఎలా నలిగిపోయింది అన్నదే కాంతార సీరియల్ కథ. కాంతార సీరియల్‌కు శరత్ దర్శకత్వం వహిస్తున్నాడు. గౌరవ్, అక్షయ, పవన్ రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార సీరియల్‌కు స్క్రీన్‌ప్లే డైలాగ్స్ బాగా అందిస్తోన్నాడు.