డిసెంబరు ఆఖరులో రెండు కాస్త పేరున్న సినిమాలు విడుదలవుతున్నాయని.. వాటితో ఈ ఇయర్ ఎండింగ్ ఆసక్తికరంగా మారబోతోంది అని చదువుకున్నాం. ఇతర భాషల్లో సినిమాలు ఉన్నప్పటికీ రెండు సినిమాల మధ్యనే పోరు అనేలా డిసెంబరు 25న టాలీవుడ్‌లో పరిస్థితి కనిపిస్తోంది. కట్ చేస్తే ఇప్పుడు మూడో సినిమా డిసెంబరు ఆఖరుకి రావడానికి రెడీ అవుతోంది అని అంటున్నారు. అదే చాలా కాలంగా కోల్డ్ స్టోరేజీలో ఉన్న ‘టైసన్ నాయుడు’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబోలో చాలా నెలల క్రితం ప్రారంభమైన సినిమా ఇది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇటీవల ‘కిష్కింధపురి’ అంటూ ఓ హారర్ సినిమాతో వచ్చాడు. ఆ సినిమాకు ఓ మోస్తరు టాక్ వచ్చింది. ఈ క్రమంలో తన మాస్ యాక్షన్ సినిమా ‘టైసన్ నాయుడు’ను డిసెంబరు 25న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఆ సమయానికి బొమ్మ రెడీ అవుతుందా లేదా అనేది తెలియదు కానీ.. బిజనెస్‌ను ప్రారంభిస్తున్నారట. దాని బట్టే విడుదల ఉంటుంది అని చెబుతున్నారు.
క్రిస్మస్ పండగను టార్గెట్ చేసుకొని ఇప్పటికే అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ ‘డెకాయిట్’ను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు షానియేల్ డియో. తాజాగా రోషన్ ‘ఛాంపియన్’ను అప్పుడే తీసుకొస్తామని ప్రకటించారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాల్సింది. ఎందుకో కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ‘డెకాయిట్’ సినిమా పరిస్థితి కూడా అంతే.
‘డెకాయిట్’ నుండి శ్రుతి హాసన్ తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్‌ని తీసుకొని మరోసారి కాంబినేషన్ సీన్స్ షూట్ చేశారు. అలా రెండు లేటు సినిమాలు పోరు జరగబోతోంది. బాలీవుడ్ సినిమా ‘ఆల్ఫా’, హాలీవుడ్ సినిమా ‘అనకొండ’ కూడా ఆ డేట్‌కే వస్తున్నాయి. 1997లో వచ్చిన ‘అనకొండ’ సినిమాకు ఇది రీబూట్ అంటే రీమేక్‌కి ఎక్స్‌టెండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో భారీగానే విడుదల చేయాలని టీమ్ ఫిక్స్ అయిందట.