ఉందా లేదా

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేరోజు 13 సినిమాలు విడుదలవుతుండగా.. ఆ చిత్రాల్లో ఒకటి “ఉందా లేదా?”. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అందరూ కొత్తవాళ్లతో రూపొందింది. ఈ కొత్త నటీనటులు మరియు టెక్నీషియన్లు ఎలాంటి సినిమా అందించారో చూద్దాం..!!

కథ : రాజ్ (రామకృష్ణ) ఒక డాక్యుమెంటరీ ఫిలిమ్ మేకర్. అప్పటికైనా ఒక సినిమా తీసి, తన తల్లిదండ్రుల చేత శభాష్ అనిపించుకోవాలన్నది అతడి ధ్యేయం. అందుకోసం తనకు తెలిసినవాళ్లందరికీ కథలు చెబుతూ మధ్యలో తన స్నేహితుడు గిరి (సాయి) యూట్యూబ్ ఛానల్ కోసం చిన్న చిన్న డాక్యుమెంటరీస్ చేస్తుంటాడు. రాజ్ పనితనం మెచ్చిన స్పెషల్ ఆఫీసర్ అరవింద్ (రామ్ జగన్) విజయవాడలోని “రాజా హరిశ్చంధ్ర బాలికల వసతి గృహం”లోని బలవన్మరణాల గురించి డాక్యుమెంటరీ చేయమని అడుగుతాడు. మొదట్లో ఈ గోల ఎందుకు అనుకొన్నా తాను ప్రేమిస్తున్న నందిని (అంకిత) కూడా అదే హాస్టల్ లో చదువుతుండడం, ఒకానొక సందర్భంలో ఆమె ప్రాణానికి కూడా హాని ఏర్పడడంతో రంగంలోకి దిగుతాడు రాజ్. అసలు హాస్టల్ లో బలవన్మరణాల ఎందుకు జరుగుతుంటాయి? అది నిజంగా దెయ్యం పనేనా లేక మనుషులే ఎవరైనా అలా చేయిస్తున్నారా? అనేది తెలియాలంటే “ఉందా లేదా?” సినిమా చూడాలన్నమాట.

నటీనటుల పనితీరు : హీరోహీరోయిన్లుగా నటించిన రామకృష్ణ, అంకితలకు సినిమాలో ఛాన్స్ లభించిందన్న ఎగ్జయిట్ మెంట్ తప్ప నటన పరంగా కనీస స్థాయి అవగాహన లేకపోవడంతో ఏదో షార్ట్ ఫిలిమ్ ను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది వారి నటన. స్పెషల్ ఆఫీసర్ గా రామ్ జగన్, హోమ్ మినిస్టర్ గా ఝాన్సీ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. వీరిని మించి సినిమాలో చెప్పుకోదగ్గ ఆర్టిస్ట్స్ కానీ.. పెర్ఫార్మెన్స్ కానీ ఏమీ లేకపోవడం గమనార్హం.

సాంకేతికవర్గం పనితీరు : సంగీత దర్శకుడు శ్రీమురళి కార్తికేయ బ్యాగ్రౌండ్ స్కోర్ మొత్తం సూర్య “రాక్షసుడు” సినిమాలోంచి కాపీ కొట్టగా.. పాటల్లో ఏ ఒక్కటి కనీస స్థాయిలో సైతం వినసోంపుగా లేదు. మరి సినిమాటోగ్రాఫర్ కి ఎక్కువ బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల లెన్స్ లు వాడలేకపోయాడా లేక అతడికి కూడా సరైన అవగాహన లేదా అనే విషయం అర్ధం కాలేదు. అలాగే.. డి.ఐ, కలరింగ్ అవసరమైనదానికంటే ఎక్కువగా వాడడం వల్ల కొన్ని ఫ్రేమ్స్ మరీ బ్రైట్ గా, ఆర్టిస్ట్స్ ఫేసులు బర్న్ (పాలిపోయినట్లుగా కనిపించడం) అయిపోయాయి. దాంతో.. సినిమా క్వాలిటీ దారుణంగా దెబ్బపడింది, ఎడిటర్ కి పాపం దర్శకుడు సరిగా ఎక్స్ ప్లయిన్ చేయలేకపోయాడో లేక సినిమా చూశాక ఏం కట్ చేయాలి అనే విషయంపై క్లారిటీ పోయిందో అర్ధం కాదు కానీ.. సినిమా మొత్తం దాదాపుగా అతుకుల బొంతలా ఉంటుంది. నిర్మాణ విలువల గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు. సినిమా మొత్తం ఒక ఫామ్ హౌస్ లోనే అటు తిప్పి ఇటు తిప్పి ముగించేశాడు అనిపిస్తుంది.

దర్శకుడు వెంకట శివప్రసాద్ కథ కోసం కాస్త రీసెర్చ్ చేశాడనిపిస్తుంది కానీ.. అది సరిగా ప్రెజంట్ చేయలేకపోయాడు. దానికి బడ్జెట్ పరిమితులు ఉండొచ్చు లేదా మరింకేదైనా కారణం ఉండొచ్చు. కానీ.. ఫైనల్ గా సినిమా ఔట్ పుట్ అనేది దర్శకుడి ప్రతిభను నిర్ణయిస్తుంది కాబట్టి ఒక దర్శకుడిగా వెంకట శివప్రసాద్ దారుణంగా ఫెయిల్ అయినట్లే. అసలు కొన్ని సన్నివేశాలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్ధం కాదు. ల్రెడీ చిన్నపిల్లలు కూడా భయపడడం మానేసిన జంప్ స్కేర్ షాట్స్ ను బేస్ చేసుకొని భయపెడదామని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడమే కాక విపరీతంగా బోర్ కొట్టించాయి.

విశ్లేషణ : సినిమాలో కంటెంట్ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే చూస్తున్న నేటి ప్రేక్షకుడ్ని కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేని చిత్రం “ఉందా లేదా?”. దర్శకులు ఇప్పటికైనా మారి ఉన్న బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమాలు తీయడానికి ప్రయత్నించాలని కోరుకొందాం.

రేటింగ్ : 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus