‘పుష్ప’.. ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాల్లో ఒకటి. అందులోనూ అల్లు అర్జున్- సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం. ఇద్దరూ చెరో నాన్ – బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టి భీభత్సమైన ఫామ్లో ఉన్నారు కాబట్టి ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు పార్ట్ లు గా ‘పుష్ప’ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.మొదటి పార్ట్ ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్టు దర్శకనిర్మాతలు ఈ మధ్యనే ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. సుకుమార్ తెరకెక్కించే ప్రతీ సినిమాలోనూ మాస్ సాంగ్ ఒకటి ఉండేలా చూసుకుంటాడు. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ మాస్ సాంగ్స్ ఉంటాయి. ‘పుష్ప’ లో కూడా అదిరిపోయే ఐటెం నెంబర్ ఒకటి ఉందట. ఆ పాట కోసం ఊర్వశి రౌటెలా వంటి భామలను అనుకున్నప్పటికీ చివరికి నోరా ఫతేహిని ఫైనల్ చేశారట. కేవలం ఈ ఒక్క పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది.
నిజంగా ఇది షాకింగ్ రెమ్యునరేషనే..! ఎందుకంటే ఒక సినిమాకి ఓ స్టార్ హీరోయిన్ తీసుకునే పారితోషికం అది. ఒక్క పాటకే ఆమెకు ఇచ్చేస్తారా? అనే డిస్కషన్లు ఇప్పుడు చాలానే నడుస్తున్నాయి. ‘టెంపర్’ సినిమాలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అనే సాంగ్ కు ఆమె కేవలం రూ.4 లక్షలు తీసుకుంది. తర్వాత ‘బాహుబలి ది బిగినింగ్’ లో మనోహరి పాటకి రూ.6 లక్షలు తీసుకుంది. అయితే ఈ 5 ఏళ్ళలో ఆమె క్రేజ్ బాగా పెరిగింది లెండి. కానీ ఏకంగా రూ.2 కోట్ల స్థాయిలో పెరిగిందా అంటే.. షాకింగ్ అనే చెప్పాలి.