రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రిపబ్లిక్”. పొలిటికల్ జోనర్ లో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు (అక్టోబర్ 1) విడుదలైంది. ఇటీవల సాయికి యాక్సిడెంట్ అవ్వడం, “రిపబ్లిక్” ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టిన తీరు పుణ్యమా అని ఈ సినిమాకి విశేషమైన క్రేజ్ ఏర్పడింది. మరి ఈ క్రేజ్ ను “రిపబ్లిక్” క్యాష్ చేసుకోగలిగిందా లేదా? అనేది చూద్దాం..!!

కథ: పంజా అభిరామ్ (సాయిధరమ్ తేజ్) గోదావరి జిల్లా కలెక్టర్. జిల్లాలోని రూలింగ్ పార్టీ లీడర్ విశాఖవాణి (రమ్యకృష్ణ) పద్ధతులు, విధివిధానాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గ్రహించి, ఆ కష్టాలు తీర్చడానికి పూనుకుంటాడు అభిరామ్. అదే రాజకీయ గుండంలో చిక్కుకున్న దశరధ్ (జగపతిబాబు) కూడా అభిరామ్ కి సహాయపడడానికి ప్రయత్నిస్తాడు కానీ..

విశాఖవాణి రాజకీయం ముందు ఇద్దరు నిలవలేకపోతారు. ఒక బాధ్యతగల కలెక్టర్ గా అభిరామ్ తన వృత్తిని ఎలా నిర్వర్తించాడు? విశాఖవాణి ఆడిన రాజకీయ చదరంగంలో గెలవగలిగాడా లేదా? అనేది “రిపబ్లిక్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: సాయిధరమ్ తేజ్ నటుడిగా తనను తాను ఇంప్రూవ్ చేసుకున్న సినిమా ఇది. ఒకానొక దశలో తన రొటీన్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను చిరాకుపెట్టిన సాయి.. “రిపబ్లిక్”తో పంధా మార్చాడు. క్యారెక్టర్ ను పూర్తిస్థాయిలో స్టడీ చేసి, అర్ధం చేసుకొని పోషించాడు. అందువల్ల నటించినట్లుగా కాక బిహేవ్ చేసినట్లనిపిస్తుంది. నటుడిగా సాయి ఒక మెట్టెక్కాడు.

ఐశ్వర్య రాజేష్ సినిమాకి నేటివిటీ ఫీల్ పోగొట్టకుండా జాగ్రత్తపడింది. సౌత్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా గ్రామీణ నేపధ్యం ఉన్న సినిమాల్లో సౌత్ హీరోయిన్స్ ఎందుకు ఉండాలి అనేది ఈ సినిమాతో మరోసారి స్పష్టమైంది. ఐశ్వర్య తన పాత్రకు న్యాయం చేసింది.

జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన బెస్ట్ రోల్ ఇదేనని చెప్పొచ్చు. ఒక నటుడిగా తాను ఎలాంటి పాత్రలైనా పోషించగలను అని ప్రూవ్ చేసుకున్నాడు జగ్గూభాయ్. ఎమోషనల్ సీన్స్ లో జగపతిబాబు నటన అదిరింది. నెగిటివ్ రోల్ రమ్యకృష్ణకు కొత్త కాదు. నరసింహ సినిమాలోనే నీలాంబరిగా అదరగొట్టింది. ఈ సినిమాలోనూ విశాఖవాణిగా తన సత్తా చాటుకుంది.

సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ పాటల కంటే నేపధ్య సంగీతం బాగుంది. కెమెరా వర్క్ ఇంకాస్త బాగుండొచ్చు అనిపించింది. సీజీ వర్క్ విషయంలోనూ ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. దేవాకట్టా సినిమాల్లో ఎప్పుడూ మాంచి ఇంటెన్సిటీ ఉంటుంది. అది సన్నివేశాల్లో కావచ్చు, పాత్రల్లో కావచ్చు లేదా సందర్భంలో కావచ్చు. ఇంటెన్సిటీ అనేది మాత్రం కామన్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ “ప్రస్థానం”కి ప్లస్ పాయింట్ గా నిలిస్తే.. “ఆటో నగర్ సూర్య”కు మైనస్ గా మారింది.

అయితే.. “రిపబ్లిక్”కి వచ్చేసరికి దాని బ్యాలెన్స్ చేసాడు. దాంతో.. ఎక్కువా అనిపించకుండా, తగ్గింది అనే భావన రాకుండా సినిమా అలా సాగిపోతుంది. అయితే.. క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త క్లారిటీ మైంటైన్ చేసి ఉంటే బాగుండేది. అన్నిటికంటే ముఖ్యంగా.. సమస్యలు వేలెత్తి చూపినట్లుగా.. ఆ సమస్యలకు సమాధానాలు చెప్పలేకపోయాడు దేవా. అలాగే.. తాను స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సి ఉంది.

విశ్లేషణ: వ్యవస్థపై కోపం అనేది ప్రతి ఒక్కరికీ ఉండాలి. అయితే.. ఆ కోపానికి సరైన కారణం లేనప్పుడు.. దానికి విలువ పోతుంది. దేవా కట్ట సినిమాల పరిస్థితి ఇంచుమించుగా అలానే ఉంటుంది. మంచి పాయింట్ ను కథగా ఎంచుకుంటాడు, నటీనటుల నుంచి అద్భుతంగా నటన రాబట్టుకుంటాడు, సమాజానికి. ప్రభుత్వానికి సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తాడు.

అయితే.. వీటన్నిటితోపాటు కథనం అనేది చాలా ముఖ్యమనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు. “రిపబ్లిక్” విషయంలోనూ అదే జరిగింది. డీలింగ్ విషయంలో తన పంథాను మార్చుకుంటే.. దేవా కట్టా దర్శకుడిగా మరో స్థాయికి వెళ్ళిపోతాడు. అది లోపించిన కారణంగా “రిపబ్లిక్” యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Share.