స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్, బాలీవుడ్ కథానాయిక ఊర్వశి రౌటేలా నగల పెట్టె మరోసారి పోయింది. లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌లో తన నగల పెట్టె చోరీకి గురైందని ఊర్వశి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి ఆమె నగలు పోవడం టాపిక్ చర్చలోకి వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా ఆమె నగలు పెట్టే పోయిన విషయం తెలిసింది. దీంతో ఊర్వశి విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పుడేమైంది అనేది చూస్తే.. రూ.70 లక్షలు విలువున్న నగలు చోరీకి గురయ్యాయని ఇప్పుడు ఊర్వశి చెబుతోంది. వింబుల్డన్ టోర్నమెంట్ వీక్షించడానికి లండన్‌కు వెళ్లిన సందర్భంలో తన నగలను బ్యాగేజీ బెల్ట్ ఏరియా నుండి ఎవరో దొంగిలించారని ఊర్వశి అంటోంది. అలాగే ఎయిర్‌పోర్ట్ అధికారుల నుండి ఆశించిన సహకారం కూడా అందడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. విమానాశ్రయంలో సరైన భద్రత లేకపోవడాన్ని ఈ నేపథ్యంలో ప్రశ్నించింది.
‘ముంబయి నుండి ఎమిరేట్స్ విమానం ద్వారా లండన్ వెళ్లాను. అక్కడ గాట్విక్ విమానాశ్రయంలోని బ్యాగేజ్ బెల్ట్ నుండి నా లగేజీ చోరీకి గురైంది. ఈ ఘటనతో నేను వేదనకు గురయ్యాను. విమానాశ్రయ అధికారుల నుండి కూడా నాకు సరైన సహకారం అందలేదు’ అని ఊర్వశి తన పోస్టులో పేర్కొంది.
ఊర్వశి రౌటేలా లైఫ్ స్టయిల్ చాలా రిచ్‌గా ఉంటుంది. ఆమె వాడే యాక్ససరీస్ ఖరీదైనవి కూడా. గతంలో ఐఫోన్ పోగొట్టుకుంది. అది అలాంటి లాంటి ఫోన్ కాదు, బంగారంతో చేసిన లిమిటెడ్ వెర్షన్. ఇండియా – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వెళ్లి, అక్కడ తన ఫోన్ పోగొట్టుకుంది. ఇప్పుడు ఖరీదైన బ్యాగుతో పాటు, నగలు పోయాయి. అందుకే ఆమెకే ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న వచ్చింది. ఈ బ్యాగు త్వరగా దొరకాలని, ఇకపై ఆమెకు ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం.