యు టర్న్

  • September 14, 2018 / 04:36 AM IST

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “యు టర్న్” చిత్రాన్ని మెచ్చి అదే దర్శకుడితో సమంత ఎరికోరి మరీ నటించి.. అదే పేరుతో రీమేక్ చేసిన సినిమా “యు టర్న్”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ కన్నడ రీమేక్ తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ:
రచన (సమంత) టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ లో ట్రైనీ రిపోర్టర్. హైద్రాబాద్ లోని ఓ ఫేమస్ బ్రిడ్జ్ మీద జరిగే యాక్సిడెంట్స్ మీద రిపోర్ట్ తయారు చేయడం కోసం ఆ బ్రిడ్జ్ మీద రాంగ్ “యు టర్న్” తీసుకొనే కొందరి డీటెయిల్స్ ను అదే బ్రిడ్జ్ మీద నివాసముండే ఓ మూగవాడి ద్వారా తీసుకొంటుంది. సరిగ్గా తన స్టైల్ లో అందర్నీ ఇంటర్వ్యూ చేద్దామని మొదట సుందర్ అనే వ్యక్తి ఇంటికి వెళుతుంది. కానీ.. ఎంతసేపు డోర్ కొట్టినా కూడా తెరవకపోయేసరికి వెనుదిగురుగుతుంది. ఆదేరోజు తన క్రష్ అయిన ఆదిత్య (రాహుల్ రవీంద్రన్)తో సినిమాకెళ్లి తిరిగి ఇంటికొచ్చేసరికి సుందర్ హత్య కేసులో రచనను అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఏం చేయాలో తోచక కన్ఫ్యూజన్ లో ఉన్న రచనకు అండగా నిలుస్తాడు ఏ.సి.పి నాయక్ (ఆది పినిశెట్టి).

అయితే.. సుందర్ మాత్రమే కాక అప్పటివరకూ రచన గేదర్ చేసిన పదిమంది కూడా ఇదే తరహాలో చనిపోయారని తెలుసుకొని షాక్ గురవుతారు అందరూ. దాంతో అప్పటివరకూ ఒకదారిలో వెలుతున్న ఇన్వెస్టిగేషన్ సడన్ గా “యు టర్న్” తీసుకొంటుంది. అసలు ఆ పదిమంది మరణం వెనుకనున్న కారణం ఏమిటి? ఈ మరణాలకు రచనకు ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మాత్రం “యు టర్న్” చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:


సినిమాలో ప్రధాన పాత్రధారి అయిన సమంత కొందరి సోషల్ మీడియాలో పేర్కొంటున్నట్లుగా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా.. కామెండబుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొంది. సినిమా ప్రారంభంలో ఆ పాత్రలోకి ఇమడడానికి కష్టపడుతున్నట్లుగా అనిపిస్తుంది.. సెకండాఫ్ కి వచ్చేసరికి సెటిల్ అయిపోతుంది. నిజానికి ఈ పాత్ర ఓ కొత్త హీరోయిన్ చేస్తే బాగుండేది. అయితే.. ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వడానికి సమంత స్టార్ డమ్ సరిపోతుంది కాబట్టి ఆమెను తీసుకోవడం కూడా సబబే అనిపిస్తుంది. కాకపోతే.. డబ్బింగ్ విషయంలో సమంత ఇంకాస్త జాగ్రత్త తీసుకోవడమో లేక తన ఆత్మ అయిన చిన్మయి చేత చెప్పించి ఉంటే ఇంకా బాగుండేది.

రాహుల్ రవీంద్రన్ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆదిత్య పాత్రను పండించగా.. నాయక్ రోల్ లో ఆది పినిశెట్టి మరోమారు తన నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సినిమాలో కీలకపాత్ర పోషించిన భూమిక.. ఆ పాత్రకు కావాల్సిన ఇంపాక్ట్ ను మాత్రం తన నటనతో తీసుకురాలేకపోయింది. నిజానికి ఆమె పాత్ర, స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ లాంటివి కానీ.. భూమిక ఆ బరువును సరిగా మోయలేకపోయింది. ఆడుకాలం నరేన్ చిన్న పాత్రే అయినప్పటికీ ఆకట్టుకొన్నాడు.

సాంకేతికవర్గం పనితీరు:
నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ వర్క్ బాగున్నప్పటికీ.. ఎక్కడో సహజత్వం లోపించిందన్న వెలితి మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా.. మొదటి నుంచి ఏదో దెయ్యం ఫీల్ తీసుకురావడం కోసం వాడిన కెమెరా యాంగిల్స్ ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ ను కిల్ చేసి.. మొదట్లోనే కథాంశాన్ని గెస్ చేసేలా చేశాయి. అలాగే.. కన్నడ వెర్షన్ కు బిగ్గెస్ట్ ఎస్సెట్ అయిన గ్రే టింట్ లేకపోవడంతో థ్రిల్లర్ ఫీల్ కలగదు.

పూర్ణ చంద్ర తేజస్వి నేపధ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్స్ లో ఒకటి. అయితే.. ఈ తరహా థ్రిల్లర్స్ కు చాలా కీలకమైన సౌండ్ డిజైనింగ్ విషయంలో ఇంకాస్త ప్రత్యేక శ్రద్ధ చూపి ఉంటే బాగుండేది. సురేష్ అరుముగమ్ ఎడిటింగ్ సినిమాకి ఆయువుపట్టు. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి.

దర్శకుడు పవన్ కుమార్.. తాను కన్నడలో తెరకెక్కించిన “యు టర్న్” మేజిక్ ను రీక్రియేట్ చేయడంలో కాస్త తడబడ్డాడు కానీ.. ఓవరాల్ గా పర్వాలేదనిపించుకొన్నాడు. అయితే.. కన్నడ వెర్షన్ రియలిస్టిక్ ఫీల్ & థ్రిల్ ను మాత్రం పూర్తిస్థాయిలో రీక్రియేట్ చేయలేకపోయాడు. కానీ.. పవన్ కుమార్ మార్క్ డీటెయిలింగ్ మాత్రం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది.

విశ్లేషణ:
కన్నడ వెర్షన్ చూసినవాళ్లని పెద్దగా ఎగ్జైట్ చేయదు కానీ.. మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చే చిత్రం “యు టర్న్”. ఈ సినిమా చూసిన తర్వాత రాంగ్ టర్న్ తీసుకోవాలంటే భయపడకపోయినా.. ఒకసారి తప్పకుండా ఆలోచిస్తారు.

రేటింగ్: 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus