“సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమాతో హీరోగా మారి పర్వాలేదనిపించుకొన్న సప్తగిరి అనంతరం “సప్తగిరి ఎల్.ఎల్.బి”తో మరోమారు ప్రయత్నించి విఫలమయ్యాడు. ముచ్చటగా మూడో ప్రయత్నంగా హీరోగా నటించిన చిత్రం “వజ్ర కవచధర గోవింద”. అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఫిలిమ్ నేడు (జూన్ 14) విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా సప్తగిరి హీరోగా సక్సెస్ అందుకోగలిగాడా లేదా అనేది చూద్దాం.!!
కథ: పీలేరు అనే గ్రామంలోని జనంలో సగానికిపైగా క్యాన్సర్ కారణంగా బాధపడుతుంటారు. వారి బాధలు తీర్చాలంటే సొంత ఊరులో క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని నిర్ణయించుకొంటాడు గోవిందు (సప్తగిరి). అందుకోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండగా ఒకసారి కొలంబస్ నారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి వెళ్ళగా పరశురామ క్షేత్రం అనే ఊర్లోని దేవుడు లేని దేవాలయంలో వందల కోట్ల రూపాయల నిధి ఉందని తెలుసుకొంటాడు. దొంగ బాబాగా ఆ ఊర్లోకి ప్రవేశించి నిధి కాకపోయినా ఒక 200 కోట్ల రూపాయల వజ్రాన్ని కనుగొంటాడు..
ఆ వజ్రంతో తన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకొంటాడు కానీ అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఏమిటా సమస్యలు? గోవిందు వాటిని ఎలా అధిగమించాడు? అనేది “వజ్ర కవచధర గోవింద” కథ…
నటీనటుల పనితీరు: సప్తగిరి కామెడీ పంచ్ లు కొన్ని పర్వాలేదు కానీ.. కామెడీ మాత్రం పెద్దగా పండించలేకపోయాడు. పైగా.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేద్దామనుకొని చేసిన ఓవర్ యాక్షన్ చిరాగ్గా ఉంటుంది. దొంగ బాబాగా కాస్త నవ్వించగలిగాడు కానీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి సప్తగిరి మతిమరుపు వ్యక్తిగా చేసిన నటన చూడడం కూడా ప్రేక్షకుల సహనానికి ఒక పరీక్షలా మారుతుంది.
ఇక హీరోయిన్ వైభవి జోషి నటిస్తున్నాను అనుకోని చేసిన పెర్ఫార్మెన్స్ మరీ చిరాగ్గా ఉంటుంది. ఇక సప్తగిరి పక్కన ఆమె మరీ పెద్దదానిలా కనిపిస్తుంది.
అవినాష్, శ్రీనివాస్ రెడ్డి మరియు జబర్డస్త్ కామెడియన్స్ అందరూ సినిమాలో ఉన్నప్పటికీ.. దర్శకుడు రాసుకొన్న సన్నివేశాల కారణంగా కామెడీ పండలేదు.
సాంకేతికవర్గం పనితీరు: విజయ్ బుల్గానిన్ సంగీతం, రచయితల సాహిత్యం చాలా బాగున్నా ఆ పాటలు వచ్చే సందర్భం సరిగా లేకపోవడంతో అతడి కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది.
సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇక దర్శకుడు అరుణ్ పవార్ రాసుకొన్న కథ-స్క్రీన్ ప్లే ఎంత వీక్ గా ఉన్నాయంటే.. ఏదో సినిమాని ఒక రెండు గంటలపాటు సాగదీయాలి కాబట్టి సన్నివేశాలు అల్లుకుంటూపోయాడు తప్పితే.. ఒక చక్కని కథనం అనేది ఎక్కడా కనిపించదు. దర్శకుడిగా, కథకుడిగా అరుణ్ పవార్ ప్రేక్షకుల సహనంతో ఆడుకొన్నాడని చెప్పొచ్చు. సన్నివేశానికి, సన్నివేశానికి లింక్ ఉండకపోగా.. మధ్యలో వచ్చే పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించడం కోసం చేర్చిన సన్నివేశాలు ఇంకాస్త చిరాకు పుట్టిస్తాయి.
విశ్లేషణ: మరీ ఖాళీగా ఉండి, ఏం చేయాలో తోచని పరిస్థితిలో.. ఓ అరగంట కామెడీ కోసం ఒక రెండు గంటల బోర్ డమ్ ను భరించగల ఓపిక, సహనం ఉన్నవాళ్ళు మాత్రమే చూడదగిన చిత్రం “వజ్ర కవచధర గోవింద”.
రేటింగ్: 1/5