నటీనటులు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో ఉన్నా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలు వెంటనే దొరక్కపోవచ్చు. కొంతమందికి బ్రేక్ వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. ఇటీవల మరణించిన టాలీవుడ్ నటుడు డి.ఎం.కె చాలా సినిమాల్లో నటించాడు. కానీ అతనికి గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రలు ఏమీ లేవు. అలాంటి వారు తమ బాధలు ఎంత చెప్పుకున్నా.. ఎవ్వరూ వినరు. ఒకవేళ విన్నా.. పట్టించుకోరు. అదే కాస్త గుర్తింపు వచ్చిందంటే.. వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నా అందరూ స్పందిస్తారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను.. అంటే ‘వకీల్ సాబ్’ లో సూపర్ ఉమెన్ సరళాదేవి పాత్రను పోషించిన లిరీష్.. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉంది. ఆమె గతంలో చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ మూవీలో కూడా నటించింది. ఆ సినిమాలో సునీల్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా ఆమె కనిపించింది. ఆ తర్వాత ‘వరుడు’ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా 2010 లో రిలీజ్ అయ్యింది. దాదాపు ఆ సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు పూర్తికావస్తున్నా.. ఆ సినిమాకి గాను ఆమెకు చెల్లించాల్సిన పారితోషికం ఇంకా ఇవ్వలేదట.
ఆ సినిమాకి నిర్మాత ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా ప్రాజెక్టుని నిర్మించిన డి.వి.వి దానయ్య. అయితే ఎంత పెద్ద నిర్మాత అయినా జూనియర్ ఆర్టిస్ట్ లకు డైరెక్ట్ గా పేమెంట్ ఇవ్వరు. వాళ్ళ మేనేజర్ల ద్వారా ఇప్పిస్తారు. ఆ మేనేజర్లు దొరికినంత దోచేసే నటీనటులకు వేరే లెక్కలు చెప్పి వారికి ఇస్తుంటారు. అయితే లిరీష్ కు ‘వరుడు’ సినిమా షూటింగ్ 40 రోజులు పూర్తయ్యాక సగం పారితోషికం ఇచ్చారట. బ్యాలెన్స్ అమౌంట్ ఇప్పటికీ ఇవ్వలేదట.
దానికోసం మేనేజర్ కు ఇప్పటికీ ఫోన్లు చేస్తూనే ఉందట.పెద్ద బ్యానర్లలోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని ఆమె తెలిపింది. ‘వకీల్ సాబ్’ వలన ఆమెకు పేరొచ్చింది కాబట్టి మీడియా అడిగి మరీ ఇంటర్వ్యూలు తీసుకుంటుంది. అందువల్ల ఆమె సమస్యలు అందరికీ తెలిసాయి. అయితే గుర్తింపురాని జూనియర్ ఆర్టిస్ట్ ల సంగతేంటి? అంటే ఎవరికైనా జాలి వేయక మానదు.