Valimai Review: వలిమై సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 24, 2022 / 02:42 PM IST

తమిళ స్టార్ కథానాయకుడు అజిత్, టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ ల కాంబినేషన్ లో రూపొందిన రెండో చిత్రం “వలిమై”. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ ను కనీసం తెలుగులోకి అనువదించకుండా.. తమిళ టైటిల్ తోనే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను ఏకకాలంలో విడుదల చేశారు. కార్తికేయ ప్రతినాయకుడిగా కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ & మేకింగ్ వీడియోస్ సినిమా మీద విపరీతమైన అంచనాలని పెంచేశాయి. మరి సినిమా అదే స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!

కథ: నగరంలోని యువత మాదక ద్రవ్యాలకు బానిసై.. ఆ డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బు కోసం బైకర్ గ్యాంగ్ లో జాయినై.. చైన్ స్నాచింగ్ లు, మర్డర్ లు చేస్తుంటారు. ఒకానొక దశలో ఈ గ్యాంగ్ చేష్టలు రాష్ట్ర పోలీసులకు తలనొప్పిగా మారతాయి. ఈ బైకర్ గ్యాంగ్ అరాచకాలను అరికట్టే బాధ్యతను అర్జున్ (అజిత్)కు అప్పగిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. స్వతహా బైకర్ అయిన అర్జున్.. ఈ గ్యాంగ్ ను ఎలా అడ్డుకున్నాడు? అందుకోసం అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “వలిమై” కథాంశం.

నటీనటుల పనితీరు: చాన్నాళ్ల తర్వాత అజిత్ తాను పోషించే రొటీన్ క్యారెక్టర్స్ కు భిన్నంగా కొత్తగా కనిపించాడు. నడి వయసు పోలీస్ ఆఫీసర్ గా అతని బాడీ లాంగ్వేజ్ సినిమాకి ప్లస్ అయ్యింది. ఇక అజిత్ ఎలాంటి డూప్ లేకుండా రిస్క్ తీసుకొని చేసే యాక్షన్ సీన్స్ & ఛేజింగ్ సీక్వెన్స్ ల కోసమైనా ఈ చిత్రాన్ని థియేటర్లో కనీసం రెండుమూడు సార్లు చూడాలనిపిస్తుంది.

కార్తికేయ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానంలో పెద్దగా కిక్ లేదు.. అందువల్ల సాధారణ విలన్ లానే కనిపిస్తాడు కానీ ప్రత్యేకత ఏమీ ఉండదు. నటుడిగా మాత్రం తన వంతు కృషి అందించాడు కార్తికేయ.

హుమా ఖురేషీ క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉన్నప్పటికీ.. ఆమెతో అనవసరమైన సెంటిమెంట్ సీన్స్ చేయించి ఆ క్యారెక్టర్ ఆర్క్ ను మధ్యలోనే నరికేశారు.

ఫ్యామిలీ & సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ పరిధి మేరకు చక్కగా నటించారు.

సాంకేతికవర్గం పనితీరు: ఛాయాగ్రహకుడు నిరవ్ షా గురించి ముందుగా చెప్పుకోవాలి. యాక్షన్ సీక్వెన్స్ లను ఆయన తెరకెక్కించిన విధానం “గగుర్పాటుకు”కు గురిచేస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ స్థాయి యాక్షన్ బ్లాక్స్ ఇప్పటివరకూ రాలేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. “మిషన్ ఇంపాజబుల్” ఇండియన్ వెర్షన్ చూస్తున్న ఫీల్ కలుగుతుంది యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నంతసేపూ.

జిబ్రాన్ నేపధ్య సంగీతం సినిమాకి ఆయువుపట్టు అని చెప్పాలి. తనదైన శైలి టిపికల్ సౌండ్ డిజైనింగ్ తో ఆడియన్స్ ను సినిమాలో ఇన్వాల్వ్ చేసేశాడు. యువన్ శంకర్ రాజా పాటలు సోసోగా ఉన్నాయి.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ ను ప్రత్యేకంగా అభినందించాలి. “సాతాన్ స్లేవ్స్” అనే నిజమైన బైకర్ గ్యాంగ్ గురించి పూర్తిగా తెలుసుకొని, స్టడీ చేసి ఆ థీమ్ ను స్క్రీన్ పై ప్రెజంట్ చేసిన విధానం బాగుంది.

ఇక దర్శకుడు హెచ్.వినోద్ విషయానికి వస్తే.. తాను రాసుకొనే కథలు, పాత్రలపై విశేషమైన రీతిలో డెప్త్ ఎనాలసిస్ చేసుకోవడమే కాక, క్యారెక్టర్ ఆర్క్స్ ను అతడు డిజైన్ చేసుకొనే విధానమే అతడి దర్శకత్వ ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం అతడు డిజైన్ చేసుకున్న యాక్షన్ సీన్స్ & ఆ సీన్స్ ప్లేస్ మెంట్ అదిరింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే బస్ ఛేజింగ్ సీక్వెన్స్ కు జనాలు స్థాణువులైపోతారు. అయితే.. హైరేంజ్ యాక్షన్ డ్రామాగా సాగుతున్న కథలోని జొప్పించిన మదర్ సెంటిమెంట్ సినిమాకి స్పీడ్ బ్రేకర్ గా మారిందని చెప్పాలి.

ఆ సీక్వెన్స్ మొత్తం తీసేసినా సినిమాకి చిన్నపాటి నష్టం కూడా ఉండదు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఆ సీన్స్ ఇరికించాడో లేక ప్రొడ్యూసర్ ప్రెజర్ ఉందో తెలియదు కానీ.. మదర్ సెంటిమెంట్ & క్లైమాక్స్ ను డీల్ చేయడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సెకండాఫ్ కంటిన్యూ చేయలేకపోయింది. ఈ చిన్నపాటి మైనస్ ను పక్కన పెడితే.. దర్శకుడిగా వినోద్ తన స్థాయిని పెంచుకున్నాడనే చెప్పాలి.

విశ్లేషణ: సెకండాఫ్ లో వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్స్ ను మినహాయిస్తే.. సినిమా మొత్తం డల్ మూమెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా సాగిన సినిమా “వలిమై”. అజిత్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అయితే.. సాధారణ ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ మంచి ఎక్స్ పీరియన్స్. ఓవరాల్ గా అజిత్ మళ్ళీ ఓ బ్లాక్ బస్టర్ అందుకున్నాడనే చెప్పాలి. మరి నిర్మాత బోణీ కపూర్ “వలిమై”కు సీక్వెల్ ను ఎనౌన్స్ చేస్తాడో లేదో చూద్దాం.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus