Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

చేతిలో టైటిల్‌ లేకుండా, పేరు పెట్టేశాక ఆ టైటిల్‌ నిలబడుతుందా అనేది తెలియకుండా.. ఓ సినిమాకు పేరు పెట్టేశారు అంటే నమ్ముతారా? అది కూడా ఆ సినిమా ప్రపంచ వేదిక మీద ఇండియన్‌ సినిమా గొప్పతాన్ని పెంచే సినిమా అవుతుందని, కుదిరితే ప్రపంచ సినిమాతో పోటీపడే సినిమా. అవును మేం చెప్పేది ‘వారణాసి’ సినిమా టైటిల్‌ గురించే. ఓ భారీ కార్యక్రమం పెట్టి మరీ సినిమా టైటిల్‌ని అనౌన్స్‌ చేశారు రాజమౌఇ అండ్‌ కో. అయితే ఆ ఈవెంట్‌ అయిన 230 రోజులకుపైగా సమయం గడిచాక టైటిల్‌ సొంతమైంది.

Varanasi

‘వారణాసి’ సినిమా టైటిల్‌ను గతేడాది నవంబరు 15న ఘనంగా విడుదల చేశారు. ఇప్పుడు అంటే జులై 24న సినిమా టైటిల్‌ను వేరొకరి దగ్గర తీసుకున్నాడు. అంటే ఫైనల్లీ చెప్పిన టైటిల్‌ ఎట్టకేలకు రాజమౌళి – మహేష్‌బాబుకు వచ్చిందన్నమాట. ఈ క్రమంలో పెద్ద చర్చలు, విమర్శలు జరిగాయి. దీంతో ఒకానొక సమయంలో రాజమౌళి – మహేష్‌బాబుకు ‘వారణాసి’ టైటిల్‌ దక్కుతుందా అనే డౌట్‌ కూడా టాలీవుడ్‌ వర్గాల్లో వినిపించింది. అయితే ఇప్పుడు ఈ విషయం అంతా ఫిక్స్‌ అయిపోయింది.

‘వారణాసి’ అనే టైటిల్‌ని దర్శకుడు సుబ్బారెడ్డి కొన్ని రోజుల క్రితం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలిలో రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈ విషయం తెలిసో తెలియకో మహేశ్‌బాబు – రాజమౌళి కలయికలో రూపొందుతున్న సినిమాకు అదే పేరుని ఖరారు చేశారు. దీంతో సుబ్బారెడ్డి నా టైటిల్‌ను మీరెలా పెట్టుకుంటారు అని చర్చ లేవనెత్తారు. చలన చిత్ర వాణిజ్య మండలి నిబంధనల ప్రకారం అప్పటికే ఒకరిపై రిజిస్ట్రేషన్‌ అయిన పేరుని, మరో సినిమాకి ఖరారు చేయడం కుదరదు.

ఈ నేపథ్యంలో నిర్మాత కె.ఎల్‌.నారాయణ రంగంలోకి దిగి, ఫిల్మ్‌ ఛాంబర్‌ నేతృత్వంలో దర్శకుడు సుబ్బారెడ్డితో చర్చలు జరిపారు. దీంతో ఆయన అంగీకరించి టైటిల్‌ ఇచ్చేశారు. సినిమా పేరుపై హక్కులు తనకే ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా టైటిల్‌ను ఇచ్చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు తన అభిమాన కథానాయకుడు మహేశ్‌ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత కేఎల్‌ నారాయణ కలసి చేస్తున్న భారీ చిత్రానికి పేరు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని కూడా చెప్పారు.

తెలుగు దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌ సమక్షంలో ‘వారణాసి’ సినిమా పేరుకు సంబంధించిన పత్రాల్ని నిర్మాత నారాయణకు సుబ్బారెడ్డి అందజేశారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కోసం పేరు ఇస్తే పరిశ్రమకు మంచి సందేశం వెళ్తుందని పరిశ్రమ పెద్దలు చెప్పగా, సుబ్బారెడ్డి వెంటనే అంగీకరించారట. కార్తికేయతో కలసి కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న రిలీజ్ అవుతుంది.

 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus