తొలి రెండు చిత్రాలైన ‘రాజకుమారుడు’, ‘యువరాజు’ చిత్రాల ప్రభావమో లేక మరేదైనా కారణమో గానీ మహేశ్ కి ప్రిన్స్ అన్న పేరు నామకరణం చేయకుండానే వచ్చేసింది. ఇక మెగా హీరోల్లోకి అందగాడిగా పిలవబడుతున్న వరుణ్ తేజ్ ని కూడా మెగాభిమానులు మెగా ప్రిన్స్ అని పిలవటం మొదలెట్టారు. బిరుదులనే పంచుకుంటున్నారు అనుకుంటే.. కథలు అదే దారి పట్టాయట. వివరాల్లోకెళితే..
ఆహ్లాదకరమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ ఖమ్ముల మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయనున్నట్టు అప్పట్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కారణాలేవైనా ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఆ కథతోనే ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘ఫిదా’ సినిమా చేస్తున్నాడట. ‘ముకుంద’ సమయంలోనే శేఖర్ ఖమ్ముల-వరుణ్ మధ్య చర్చలు జరిగినా ఆ సమయంలో ‘కంచె’, ‘లోఫర్’ సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ లోఫర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చాడు.
శ్రీను వైట్ల ‘మిస్టర్’ మొదలైన సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఆ గ్యాప్ లో శేఖర్ ఖమ్ముల వరుణ్ తో సినిమా మొదలెట్టేశారు. తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి మధ్య జరిగే కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా తొలి షెడ్యూల్ బాన్సువాడ లో పూర్తయింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేయడమే శేఖర్ ఖమ్ముల తక్షణ కర్తవ్యం.