కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. మరో వారంలో సినిమా రానుండటంతో ఆ ప్రచారం పనులు చూసుకుంటున్నాడు. ఈ సినిమా తర్వాత చేయాల్సిన సినిమాలను కిరణ్ అబ్బవరం ఇప్పటికే రెడీ చేసుకున్నాడు. అందులో ఆసక్తికరమైన ఓ సినిమా వీరా కొగటం డైరక్షన్ సినిమా. ‘పుష్ప’ సినిమాలకు దర్శకుడు సుకుమార్ టీమ్ డైలక్ట్ స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన ఆయనతో సినిమా అనేసరికి కాస్త ఎక్కువ ఆసక్తే ఉంది. ఎందుకంటే ఇద్దరూ రాయలసీమ వాళ్లే. కాబట్టి కచ్చితంగా ఆ వైబ్ కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్ ఆలోచన.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం.. భరత్ కమ్మతో కలసి అమెజాన్ ప్రైమ్ కోసం ‘గువ్వల చెరువు ఘాట్’ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్ట్ స్థానంలో వీరా కొగటం సినిమా ఉండాలి. ఈ ప్రాజెక్ట్ గురించి ‘కె ర్యాంప్’ సమయంలో నిర్మాత వంశీ నందిపాటి చిన్నగా లీక్ ఇచ్చారు కూడా. రేపో మాపో ఈ సినిమా మొదలవుతుంది అనేలా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇంకా మొదలుకాలేదు.
దీంతో కిరణ్ – వీరా కొగటం సినిమా ఉంటుందా అనే చర్చ రీసెంట్‌గా మొదలైంది. అయితే కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా వీరా కొగటం వెళ్లి కలిశారు. విషెష్ చెప్పి ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఈ సినిమా ఇంకా లైన్‌లో ఉన్నట్లే. అయితే లైనప్‌లో వరుస మారింది అంతే. ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కమర్షియల్, ఎంటర్టైనర్ అట. కిరణ్ పాత్ర లౌడ్‌గా కాకుండా సెటిల్డ్‌గా ఉండేలా చూసుకుంటున్నారట వీరా కొగటం.