సూర్య ప్రస్తుతం తన 47వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రచారం పనులను త్వరలో స్టార్ట్ చేస్తారు. ఈ మేరకు దర్శకుడు వెంకీ అట్లూరి.. నిర్మాత నాగవంశీ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ లోపు సూర్య తన కొత్త సినిమాకు సంబంధించిన పనులు చేసుకుంటున్నాడు. అదే తన 48వ సినిమా. అయితే ఇప్పుడు 50వ సినిమా గురించి కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఎందుకంటే సూర్య తన మైల్ స్టోన్ (50వ) సినిమాను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరక్షన్‌లో చేస్తాడు అనే పుకారు ఒకటి బయటకు రావడమే. ఇటీవల సూర్య – రాజమౌళి భేటీ అయ్యారని.. ఓ కథ గురించి మాట్లాడుకున్నారు అని వార్తలొచ్చాయి. గతంలో ఓసారి ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేయాల్సి ఉంది. చర్చలు కొంత దూరం వెళ్లాక ఆ సినిమా అప్పుడు కుదర్లేదు. అప్పుడు మిస్ అయిన కాంబో ఇప్పుడు మైల్ స్టోన్ మూవీకి ఆ కాంబో సెట్ అవుతోంది అనేసరికి అంచనాలు, ఆశలు పెరిగిపోయాయి.
కానీ, కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ కాంబినేషన్ ఏదీ ఇప్పటివరకు చర్చలోకి రాలేదట. అంతేకాదు ఈ సినిమాను పూర్తి స్థాయి కమర్షియల్ కథను, తమిళ దర్శకుడితోనే ఉండబోతోంది అని చెబుతున్నారు. అయితే నిర్మాత తెలుగు వాడే అవుతాడు అని అంటున్నారు. అయితే, గతంలో ఇదే సినిమా విషయంలో నెల్సన్ దిలీప్ కుమార్ పేరు చర్చకు వచ్చింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. మరి ఆయనే ఆ 50వ సినిమాను డైరెక్ట్ చేస్తారేమో చూడాలి.
ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే 49వ సినిమా ఏంటి అనేది కూడా తేలాలి. ఆ సినిమా సమయంలో ఆటోమేటిగ్గా 50వ సినిమా ముచ్చట్లు బయటకు వస్తాయి. ఆ 49వ సినిమాకు హెచ్.వినోద్ దర్శకుడని సమాచారం.