Venkatesh: ‘ఎఫ్3’ తో పాటు మే నెలలో విడుదలైన వెంకటేష్ 7 సినిమాలు.. మరియు వాటి రిజల్ట్స్..!

దగ్గుబాటి వెంకటేష్..దివంగత స్టార్ ప్రొడ్యూసర్ డా.డి.రామానాయుడు గారి చిన్నబ్బాయి గా సినీ కెరీర్ ను ప్రారంభించారు. నిజానికి వెంకటేష్ కు హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఉన్నత చదువులు చదువుకున్నారు కాబట్టి బిజినెస్ రంగంలో రాణించాలి అనుకునే వారు. కానీ సూపర్ స్టార్ కృష్ణతో రామానాయుడు గారు నిర్మించాల్సిన ఓ చిత్రం ఆగిపోయే స్థితిలో ఉంటే… దానికోసం వెంకటేష్ ను హీరోగా లాంచ్ చేయాల్సి వచ్చింది. అదే ‘కలియుగ పాండవులు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.

మొదటి చిత్రంతోనే వెంకటేష్ క్రియేట్ చేసిన రికార్డులు ఎన్నో. అక్కడి నుండీ వెంకటేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తండ్రి రామానాయుడు గారు, అన్న సురేష్ బాబు… అండదండలు ఉండడం.. అలాగే ఆయన శైలికి తగినట్టు మంచి అభిరుచి కలిగిన కథలను ఎంపిక చేసుకోవడంతో స్టార్ హీరోగా ఎదిగారు.టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో అత్యధిక సక్సెస్ రేటు కలిగిన హీరోగా వెంకటేష్ నిలిచారు. అందుకే ‘విక్టరీ’ ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.

ఇప్పటివరకు వెంకటేష్ 76 సినిమాల్లో నటించారు. అందులో రెండు బాలీవుడ్లో చేసిన సినిమాలు ఉన్నాయి. అయితే ‘ఎఫ్3’ తో పాటు వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు మే నెల కూడా విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.. కొన్ని హిట్ అవ్వలేదు. అసలు మే నెలలో విడుదలైన వెంకటేష్ సినిమాలు ఏంటో? వాటి ఫలితాలు ఏంటో.. ఓ లుక్కేద్దాం రండి :

1) అజేయుడు :

వెంకటేష్, శోభన జంటగా నటించిన ఈ చిత్రాన్ని జి.రామ్మోహనరావు డైరెక్ట్ చేశారు.’శ్రీ పల్లవి ఫిలిమ్స్’ బ్యానర్ పై ఎస్.వెంకటరత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. 1987 వ సంవత్సరం మే 8న ఈ మూవీ విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించలేదు.

2) భారతంలో అర్జునుడు :

వెంకటేష్, కుష్బూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.’ప్రకాష్ స్టూడియోస్’ బ్యానర్ పై కె.ఎస్.ప్రకాష్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1987 వ సంవత్సరం మే 29 న ఈ మూవీ విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్లాప్ గా మిగిలింది.

3) ఒంటరి పోరాటం :

వెంకటేష్, ఫారా జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ‘శ్రీ కృష్ణ ప్రసన్న ఎంటర్ప్రైజెస్’ బ్యానర్ పై డి.వి.ఎస్.ఎస్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1989 వ సంవత్సరం మే 18 న ఈ మూవీ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హిట్ గా నిలిచింది. వెంకటేష్ కు మే నెలలో తొలి విజయాన్ని అందించిన చిత్రమిది.

4) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు :

వెంకటేష్ హీరోగా సౌందర్య, వినీత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ అధినేత కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1996 వ సంవత్సరం మే 22న ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

5) ప్రేమించుకుందాం రా :

వెంకటేష్ హీరోగా అంజలా జవేరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని జయంత్.సి.పరాన్జీ డైరెక్ట్ చేశారు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1997 వ సంవత్సరం మే 9న ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

6) ప్రేమతో రా :

వెంకటేష్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘కలిసుందాం రా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని వెంకటేష్ కు అందించిన ఉదయ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. ‘విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్’ బ్యానర్ పై టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2001 వ సంవత్సరం మే 9న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.

7) ఎఫ్3 :

వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు.’ఎఫ్2′ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు.గత వారం( 2022) మే 27న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus