వెంకటేశ్ (Venkatesh) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే బాగుండు అంటూ చాలా ఏళ్లుగా అభిమానులు అనుకుంటున్నారు. నిర్మాత సురేశ్ బాబు కూడా అదే ప్లాన్‌లో చాలా ఏళ్లుగా ఉన్నారు. గతంలో త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకటేశ్ సినిమాలకు మంచి విజయాలు దక్కాయి. అందుకే ఈ కాంబినేషన్ మీద అంతటి హైప్ ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఆ కాంబినేషన్ కుదిరింది. హారిక హాసిని క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం.
ఈ సినిమా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పటికే నిర్మాత నాగవంశీ చెప్పేశారు. ఆ మేరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో సినిమా టైటిల్ ఒకటి బయటకు వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమాకు ‘వెంకటరమణ’ అనే పేరు పెడతారని తెలుస్తోంది. అయితే అది ‘వెంకటరమణ’నా లేక ‘వెంకట రమణ’నా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సినిమా పేరులో హీరో, హీరోయిన్ పాత్రల్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారట. వెంకటేశ్‌కు ఉన్న లేడీ ఫాలోయింగ్ నేపథ్యంలో ఇలా పేరు అనుకుంటున్నట్లు సమాచారం.
సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో టైటిల్ చెప్పకపోవచ్చు కానీ.. పాత్రల పేర్లతో ఓ స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తారు అని సమాచారం. వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరులో సినిమా పేరు రివీల్ చేస్తారని సమాచారం. వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగానే రివీల్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెంకటేశ్ తన పేరు దగ్గరగా ఉన్న పేరుతో చాలా తక్కువ సినిమాల్లో నటించారు. ‘సుందరకాండ’ సినిమాలో వెంకటేశ్వర్లుగా కనిపించారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో కూడా అదే పేరుతో నటించాడు.
ఇక ‘నమో వెంకటేశ’ సినిమాలోఓ వెంకట రమణగా కనిపించగా.. ‘బాడీగార్డ్’లో వెంకటాద్రిగా నటించాడు. ‘మసాలా’ సినిమాలో వెంకట రాజ నరసింహ బలరామ్‌గా కనిపించాడు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాల్లో వెంకీ అనే పాత్రలో నటించాడు. ఇక ఆఖరిగా ‘వెంకీమామ’లో వెంకటరత్నం పాత్రలో నటించాడు.