సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు, నటుడు, రచయిత కృష్ణస్వామి భాగ్యరాజ్ గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే ప్రముఖ ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆయన కోలుకోలేక చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.దక్షిణ భారత సినీ పరిశ్రమలో భాగ్యరాజ్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. దర్శకుడిగా, నటుడిగా, కథా రచయితగా ఇలా అనేక రకాలుగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో ఆయనను ‘కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే’గా అభిమానులు, సినీ ప్రముఖులు పిలుస్తారు. ఇక ఆయన తన కెరీర్‌లో 25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించగా.. 75కి పైగా సినిమాల్లో నటించారు. సాధారణ కథలను కూడా అసాధారణంగా, ఉహించంలేని విధంగా తెరకెక్కించే స్టార్ దర్శకుడిగా ఎదిగారు. ఆయన దర్శకత్వం వహించిన, నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ‘ముంధనై ముడిచ్చు’ చిత్రంలో నటనకు గాను తమిళనాడు ప్రభుత్వం ‘ఉత్తమ నటుడు అవార్డు’ను కూడా అందుకున్నారు. ఆయన అంతటితో ఆగకుండా మరోవైపు ‘భాగ్య’ అనే వారపత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తూ పలు నవలలు కూడా రచించారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. ఈయనకు తెలుగు సినీ పరిశ్రమతో కూడా బాగానే అనుబంధం ఉంది.
అల్లరి నరేశ్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లైంది కానీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. వీటితోపాటు ‘అబ్బాయిగారు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లేను అందించారు.ఇక భాగ్యరాజ్ కుటుంబ విషయానికి వస్తే.. ఆయనకు కుమార్తె శరణ్య భాగ్యరాజ్, కుమారుడు శంతను భాగ్యరాజ్ ఉన్నారు. కూతురు శరణ్య ‘పారిజాతం’ చిత్రంతో సినీరంగంలోకి ప్రవేశించగా.. శంతను ‘సక్కరకట్టి’ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు. గత ఏడాది విడుదలైన ‘కుబేర’ చిత్రంలో కూడా భాగ్యరాజ్ కీలక పాత్రలో నటించారు. ఇక 3 రోజుల క్రితమే గోవాలో జరిగిన కుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలకు హాజరైన ఆయన ఆకస్మిక మరణం సినీ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.