గత ఏడాది విడుదలైన బెస్ట్ తమిళ మూవీస్ లో ఒకటి “విడుదల”. కమెడియన్ టర్నడ్ హీరో సూరి (Soori Muthusamy) కథానాయకుడిగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి విశేషమైన స్పందన వచ్చింది. ఆ సినిమాకి కొనసాగింపుగా ఇవాళ రిలీజ్ అయిన సినిమా “విడుదల – 2” (Vidudala Part 2). ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వెట్రిమారన్ (Vetrimaaran) ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. మరి సినిమా ఈ పార్ట్ 2 ఆ అంచనాలను అందుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: కరుప్పన్ అలియాస్ పెరుమాళ్ (విజయ్ సేతుపతి) అరెస్ట్ తో పార్ట్ 1 ముగియగా, అతడి విచారణతో పార్ట్ 2 మొదలవుతుంది. కరుప్పన్ ను క్యాంప్ నుండి వేరే బేస్ కి మార్చాలని డిసైడ్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్, కరుప్పన్ ను అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన కుమరేశన్ (సూరి)తో కలిసి బేస్ క్యాంప్ కి బయలుదేరతారు. పోలీసులతో తన కథను పంచుకుంటాడు కరుప్పన్, అసలు కరుప్పన్ ఎవరు, అతడి పయనం ఎలా మొదలైంది? అనేది తెలుసుకొని మిగతా పోలీసులు కూడా అతడి మీద జాలిచూపడం మొదలెడతారు.
అయితే.. కరుప్పన్ అరెస్ట్ ను సీక్రెట్ గా ఉంచాలనుకున్న పోలీసుల ఆలోచన ఓ రిపోర్టర్ కారణంగా భగ్నమై.. కరుప్పన్ ను బంధీ చేసిన విషయం పేపర్ కి ఎక్కేస్తుంది. ఆ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేద్దామని పోలీస్ బృందం అనుకుంటుండగా.. కరుప్పన్ ను అతడి బృందం రక్షించి తీసుకెళ్లిపోతుంది. దాంతో.. ఎట్టిపరిస్థితుల్లోనూ కరుప్పన్ ను అరెస్ట్ చేయడానికి పోలీస్ శాఖ అన్ని విధాల ప్రయత్నాలు మొదలెడుతుంది. మరి కరుప్పన్ దొరికాడా? అతడ్ని పోలీసులు ఏం చేశారు? ఈ పోలీస్ ఆటలో కుమరేశన్ ఎవరి వైపు నిలిచాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “విడుదల-2” (Vidudala Part 2) చిత్రం.
నటీనటుల పనితీరు: ఫస్ట్ పార్ట్ మొత్తం సూరిని హీరోలా ప్రాజెక్ట్ చేయగా.. సెకండ్ పార్ట్ లో సూరి చాలా తక్కువ సీన్స్ కి పరిమితం అయిపోయాడు. సెకండ్ పార్ట్ ను విజయ్ సేతుపతి టేకోవర్ చేసాడని చెప్పాలి. విజయ్ సేతుపతిని యంగ్ గా చూపించడానికి పడిన శ్రమ సత్ఫలితాన్ని ఇవ్వలేదు కానీ.. నటుడిగా కరుప్పన్ పాత్రలో జీవించేశాడు విజయ్ సేతుపతి. థియేటర్ల నుండి బయటికి వెళ్లేప్పుడు కరుప్పన్ చెప్పిన మాటలు చెవుల్లో మాత్రమే కాదు మెదళ్లలోనూ మార్మోగుతుంటాయి.
మంజు వారియర్ (Manju Warrier) పాత్ర ఇండిపెండెంట్ ఉమెన్ వాయిస్ కు ఓ మిర్రర్ లా కనిపిస్తుంది. విజయ్ సేతుపతి తర్వాత ఆస్థాయిలో ఆకట్టుకున్న నటుడు చేతన్ (Chetan). బ్యాడ్ పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమా మొత్తానికి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మాటల రచయిత గురించి. ఈ సినిమా తీసిందే రెండు పుస్తకాల ఆధారంగా కాబట్టి.. రైటింగ్ క్రెడిట్స్ మొత్తం వెట్రిమారన్ కి ఇవ్వలేం. పోలీస్ వ్యవస్థ, రాచరికపు దురహంకారం, ప్రభుత్వం ప్రజల్ని ఎలా మోసం చేస్తుంది వంటి విషయాలను ఏమాత్రం దాపరికాలు లేకుండా వివరించిన విధానం ఓ మేలుకోలుపు లాంటిది. వెట్రిమారన్ “విడుదల-2” స్క్రీన్ ప్లేను ఒక సినిమాలా కాకుండా ఒక పుస్తకంలా ట్రీట్ చేశాడు. సందర్భానికి సందర్భానికి మధ్య వచ్చే సన్నివేశాలు అతుకుల బొంతలా కనిపిస్తాయి కానీ.. వాటిని అధ్యాయాల్లా భావిస్తే గనుక ఆ ఫీలింగ్ ఉండదు.
అలాగే.. అణగారిపోయిన, పోతున్న దీనుల బ్రతుకులను తెరపై ముసుగులేకుండా ప్రెజెంట్ చేసిన తీరు హృదయాల్ని కలచివేస్తుంది. అయితే.. ప్రీక్లైమాక్స్ లో వచ్చే షూటింగ్ సీక్వెన్స్ ను ఫుటేజ్ ఉంది కదా అని దాదాపు 20 నిమిషాల పాటు సాగదీయడం అనేది మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. దర్శకుడికి తాను రాసుకున్న సన్నివేశాల మీద ప్రేమ ఉండడం అనేది సహజమే, అయితే ఆ ప్రేమ ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టేదిగా ఉండకూడదు అనే విషయాన్ని కూడా గ్రహించాలి.
వెట్రిమారన్ ఈ చిత్రంతో దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. ఇళయరాజా (Ilaiyaraaja) ఎప్పట్లానే తనదైన సంగీతంతో కంటెంట్ ను ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ వేల్ రాజ్ (Velraj) ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. నైట్ ఎపిసోడ్స్ ను బాగా పిక్చరైజ్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ టాప్ లెవల్లో ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను కంపోజ్ చేసిన విధానం ఆడియన్స్ ను అలరించడమే కాక కథాగమనంలో కీలకపాత్ర పోషించింది.
విశ్లేషణ: పోలీస్ వ్యవస్థలోని లోపాలను ఇదివరకు కూడా కొంతమంది ఫిలిం మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ప్రయత్నించారు కానీ.. ఎలాంటి ఫిల్టర్ లేకుండా ముక్కుసూటిగా వివరించిన దర్శకుడు మాత్రం వెట్రిమారన్. ప్రజల కోసం గొంతుక విప్పిన ఒక వ్యక్తినైనా, వ్యవస్థనైనా పునాదుల నుండి ఎలా పెకలిస్తారు అనేది దృశ్యరూపంలో చూపించిన చిత్రం “విడుదల”. అనవసరమైన సాగతీత కారణంగా సెకండాఫ్ బోర్ కొడుతుంది కానీ.. సమాజం పట్ల ఒక పౌరుడికి ఉండాల్సిన బాధ్యతను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన హక్కును గుర్తుచేస్తుంది. సమాజానికి అవసరమైన సినిమా “విడుదల-2” (Vidudala Part 2). కానీ.. సినిమా చూడాలంటే మాత్రం బోలెడంత ఓపిక ఉండాలి.
ఫోకస్ పాయింట్: సిద్ధాంతాల సమరం!
రేటింగ్: 2.5/5