ఒక నటుడిగా కంటే విభిన్నమైన కథలు ఎంచుకుంటూ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం “ఇంద్రసేన” ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా తన తాజా చిత్రం గురించి, కథ ఎంపికలో తాను తీసుకొనే జాగ్రత్తల గురించి, తన భవిష్యత్ ప్రొజెక్ట్స్ గురించి మీడియాతో ముచ్చటించారు.
మా డైరెక్టర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్..
“ఇంద్రసేన” కథను మా డైరెక్టర్ దాదాపు రెండున్నరేళ్లు కష్టపడి రాసుకొన్నాడు. తనకు కూడా ట్విన్ బ్రదర్ ఉండడంతో కథలో చాలా సహజత్వం ఉంటుంది. మనం సరిగా గమనించం కానీ.. నిజానికి ప్రతి ఇంట్లో ఒక ఒక ఇంద్రసేన ఉంటాడు. అలాంటి ఒక ఇంద్రసేనుడి కథే మా చిత్రం. కుటుంబ క్షేమం కోసం ప్రరితపించే ఓ యువకుడి జీవితంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపధ్యమే కథాంశం. ఇంద్రసేన, రుద్రసేన అనే ఇద్దరు కవలల కథే ఈ చిత్రం.
డబుల్ యాక్షన్ అంత కష్టమేమీ కాదు..
ప్రస్తుతం మనకి అందుబాట్లో ఉన్న టెక్నాలజీని సరిగా వినియోగించుకోగలిగితే డబుల్ యాక్షన్ చేయడమనేది పెద్ద కష్టమేమీ కాదు. నా కెరీర్ లో నేను మొదటిసారి డబుల్ యాక్షన్ చేస్తున్నా.. పెద్ద ఇబ్బంది అనిపించలేదు.
నావి కూడా కమర్షియల్ సినిమాలే..
నేను ఎంచుకొనే కథలు మాస్ మసాలా ఎంటర్ టైనర్స్ కాకపోవచ్చు కానీ.. కమర్షియల్ గా అన్నీ సూపర్ హిట్సే. సో నాకు తెలిసినంతవరకూ నా సినిమాలన్నీ కమర్షియల్ ఎంటర్ టైనర్సేనని నా భావన. అయితే.. నా సినిమాలు ఇప్పటివరకూ అందర్నీ అలరిస్తూనే ఉన్నాయి, భవిష్యత్ లోనూ అదే విధంగా అలరిస్తాయని నమ్ముతున్నాను.
అందుకే డిఫరెంట్ కథలు సెలక్ట్ చేసుకుంటా..
నాకు తెలిసి నేను నేనంత మంచి నటుడ్ని కాను, అందుకే ఆడియన్స్ నా నటనను కాక కథ, కథనంపై కాన్సన్ ట్రేట్ చేసేలా జాగ్రత్తలు తీసుకొంటుంటాను. అందుకే టిపికల్ స్టోరీ విత్ మోర్ ఎమోషన్ ను సెలక్ట్ చేసుకొంటున్నాను.
టీజర్/ట్రైలర్ తో ఆడియన్స్ ను మోసం చేస్తున్నారు
ఈమధ్యకాలంలో మంచి ఎడిటర్ ఉంటే చాలు.. సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా టీజర్/ట్రైలర్ తో మోసం చేసేస్తున్నారు. నేను చేయడం లేదని చెప్పను కానీ.. మరీ దారుణంగా ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసి సినిమా చూశాక నిరాశపరుస్తున్నారు. అందుకే “ఇంద్రసేన” సినిమాలోని పది నిమిషాల ఫుటేజ్ ను మొన్న జరిగిన ఈవెంట్ లో ప్లే చేశాం. మంచి రెస్పాన్స్ రావడంతోపాటు.. ఆడియన్స్ కి కూడా సినిమా కంటెంట్ మీద ఒక అవగాహన వచ్చింది. నా ప్రతి సినిమాకి ఇదే తరహాలో 10 నిమిషాల కంటెంట్ ను విడుదలకు ముందే రిలీజ్ చేస్తానని చెప్పలేను కానీ.. 100% ట్రై చేస్తాను.
హీరోయిజానికి కాదు.. హ్యూమన్ ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యాను..
“బిచ్చగాడు” చిత్రానికి గానీ.. “ఇంద్రసేన” విషయంలో కానీ నేను కథ కంటే ఆ కథలోని ఎమోషన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. అందుకే కథను నమ్మి నిర్మాతగా మారి ఈ చిత్రాలను రూపొందించాను.
బిజీగా ఉండడం వల్ల ఆ ఆఫర్లు యాక్సెప్ట్ చేయట్లేదు..
స్వతహా మ్యూజిక్ డైరెక్టర్ అయిన నాకు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ.. ఒక హీరోగా/ప్రొడ్యూసర్ గా నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు.. ఒక సంగీత దర్శకుడిగా నేను బయటివారి సినిమాలకు న్యాయం చేయలేను కాబట్టే మ్యూజిక్ డైరెక్టర్ గా కొత్త ఆఫర్లు యాక్సెప్ట్ చేయట్లేదు.
టైమ్ మేనేజ్ మెంట్ ఇంపార్టెంట్..
ఒక మనిషి తన జీవితంలో కొడుకుగా, భర్తగా, తండ్రిగా, ఆఫీస్ లో ఉద్యోగిగా ఎలా అయితే భిన్న బాధ్యతలు నిర్వర్తిస్తాడో.. అదే విధంగా నేను కూడా నా కెరీర్ లో ఒక హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఎడిటర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, సౌండ్ డిజైనర్ గా నా బాధ్యతలు నేను సమయానుకూలంగా నిర్వర్తిస్తుంటాను.
ఎడిటర్ గా చేయడం వలన లాభాలెన్నో..
నా సినిమాలోని అన్ని క్రాఫ్త్స్ లోనూ నేను వేలుపెడుతుంటానని అందరూ అనుకొంటుంటారు. కానీ.. ఒక ఎడిటర్ గా వర్క్ చేయడం వల్ల నాకు లాభమే ఎక్కువ. ఎడిటింగ్ చేస్తున్నప్పుడే నా సినిమాలో ఉన్న మైనస్ అండ్ పాజిటివ్ పాయింట్స్ అన్నీ తెలుస్తాయి. మరీ ముఖ్యంగా నేను అన్నీ విషయాల్లో చాలా పర్టీక్యులర్ గా ఉంటాను. అందువల్ల సినిమాలో ఏ ఒక్క ఫ్రేమ్ లో కాస్త తేడా కనిపించినా వెంటనే దాన్ని సెట్ చేసుకొంటాను.
– Dheeraj Babu