రెండేళ్ల క్రితం వచ్చిన సినిమా ఇది. ఆ సమయంలో ఆ సినిమా బ్లాక్ బస్టర్. టాక్ విషయంలోనే కాదు.. వసూళ్ల పరంగానూ సినిమా భారీ విజయమే అందుకుంది. ఇప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటారు. రోజుకోసారైనా సినిమాను చూసి ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఎందుకంటే ‘బాహుబలి’ సినిమాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన స్ట్రాంగ్ సినిమా ఇదే. ప్రభాస్‌ని ప్రశాంత్ నీల్ అంతలా చూపించారు మరి. అయితే ఈ సినిమా ఫలితం విషయంలో ఎక్కడో చిన్న వెలితి అయితే ఉంది.
అదే ఆ సినిమా రూ.1000 కోట్లు మార్కును సినిమా అందుకోలేదని. సినిమాకు వచ్చిన హైప్, వచ్చిన టాక్ చూశాక కచ్చితంగా రూ.1000 కోట్ల వసూళ్లను సినిమా అందుకుంటుందని అనిపించింది. ఇప్పుడు సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్ కూడా ఇదే మాట అంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘సలార్ 1’, ‘సలార్ 2’ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సలార్ 2’ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పిన ఆయన.. సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారని చెప్పారు. అభిమానుల రిక్వెస్ట్‌లు మా దృష్టికి వచ్చాయి. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం అని చెప్పారు.
ఇక గతంలో ‘సలార్ 1’ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్ల గురించి కూడా విజయ్ కిరంగదూర్ మాట్లాడారు. ‘సలార్’ తమ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని.. కానీ ఆ చిత్రానికి వచ్చిన ఆదరణ సంతోషాన్నిచ్చిందని ప్రశాంత్ నీల్ అన్న విషయం తెలిసిందే. దీనిపై నిర్మాత రియాక్ట్ అవుతూ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. స్వీయ విమర్శ చేసుకోవడంలో ఆయన ముందుంటారు అని ఇంచుమించు ఆయన మాటలతో ఏకీభవించారు. మరి ఈ విషయంలో ఇప్పుడు అభిమానులు ఏమంటారో చూడాలి.