సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నెక్స్ట్ సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లిపోయాడు విజయ్. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సింగరేణిలో పని చేసే కార్మికుడిగా కనిపించబోతున్నాడని సమాచారం.
కార్మికులకు అండగా నిలబడే యూనియర్ లీడర్ గా విజయ్ నటన కచ్చితంగా ఆకట్టుకుంటుందట. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే… ఈ చిత్ర్ర కథ ప్రకారం విజయ్ కి ఎనిమిదేళ్ళ కొడుకు కూడా ఉంటాడని టాక్ వినిపిస్తోంది. అంటే… విజయ్ తండ్రి పాత్ర పోషిస్తున్నాడన్న మాట. అయితే విజయ్ అప్పుడే తండ్రి పాత్రలో కనిపించనుండడం పట్ల… కొందరు విజయ్ అభిమానులు అసంతృప్తికి గురవుతున్నారట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై డిస్కషన్లు మొదలయ్యాయి. ఇక ఈ చిత్రంలో రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ వంటి హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.