విజయ్ దేవరకొండ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తొలుత రష్మిక మందనతో ఎంగేజ్‌మెంట్ అయిందని సమాచారం బయటకు వచ్చింది. దానిని విజయ్, రష్మిక అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా ఆయన సన్నిహితులు మాత్రం అవుననే అంటున్నారు. ఇక విజయ్ చేతికి కొత్తగా ఓ రింగ్ కనిపించింది. అది ఎంగేజ్‌మెంట్ రింగే అనే అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన పుట్టపర్తికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ఇటీవల యాక్సిడెంట్‌కి గురైంది. మరోవైపు విజయ్ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ఇలా విజయ్ వైరల్‌గానే ఉన్నాడు.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేశాడు. తన జీవితంలో కీలక పాత్ర పోషించిన మనుషులు, చోటును అభిమానులకు పరిచయం చేస్తున్నా అంటూ ఆ వీడియోను షేర్ చేశాడు. ఇటీవల విజయ్ తన కుటుంబంతో కలిసి పుట్టపర్తి వెళ్లిన సంగతి తెలిసిందే. సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని, తాను చదువుకున్న సత్యసాయి విద్యా సంస్థలను సందర్శించారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మన ఎదుగుదలను మనుషులు, ప్రదేశాలు ప్రభావితం చేస్తుంటాయి. నా జీవితంలో కీలకమైన చోటు, మనుషులు వీళ్లే. వీరికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అని విజయ్ దేవరకొండ ఆ వీడియోతో రాసుకొచ్చారు. సాయి విద్యా సంస్థల ప్రిన్సిపల్ ముని కౌర్‌తో విజయ్ ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు. విద్యార్థులకు ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆనందపరిచాడు. ఆ తర్వాత తాను చదివిన తరగతి గది, హాస్టల్ రూమ్‌కి వెళ్లి చూసి నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
ఈ పర్యటన అనంతరం హైదరాబాద్‌కి తిరుగు పయనమైన విజయ్ కారు సోమవారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. అయితే అంతా క్షేమమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఓ బిర్యానీ, మంచి నిద్రతో తాను నార్మల్ అయిపోతా అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.