తమిళ స్టార్ నటుడు విజయ్ (Vijay) ఇటీవల TVK అనే రాజకీయ పార్టీని స్థాపించి, తమిళనాడు మొత్తం యాక్టివ్ గా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కరూర్ ప్రాంతంలో రోడ్ షో నిర్వహించగా.. ఊహించని విధంగా తొక్కిసలాట చోటు చేసుకుని దాదాపు 30 మంది చనిపోయారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉండడం బాధాకరం. ఈ విషయమై తమిళనాట మాత్రమే కాక.. తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. విజయ్ (Vijay) చనిపోయిన కుటుంబాలకి 20 లక్షల రూపాయలు మరియు దెబ్బలు తగిలినవారికి 2 లక్షలు ప్రకటించారు కూడా.
అయితే.. విజయ్ రోడ్ షో ను నిర్వహించిన విధానం సరికాదు అంటూ తమిళనాట రాజకీయ పార్టీ పెద్దలందరూ ఘాటుగా స్పందించి, అర్జెంటుగా విజయ్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ అరెస్ట్ ను మధ్యలోకి తీసుకొస్తున్నారు. దాంతో విజయ్ ఒక వీడియో రెస్పాన్స్ వదిలాడు.
“కరూర్ ఘటనలో మరణాలు చాలా బాధాకరం, నన్ను అరెస్ట్ చేయాలంటూ చాలామంది అడుగుతున్నారు. అసలు నిజం ఏమిటి అనేది త్వరలోనే బయటపడుతుంది. మా మీద చాలా కేసులు పెడుతున్నారు. అన్నిటికీ సమాధానం త్వరలోనే తెలుస్తుంది. అప్పటివరకు ఓపిగ్గా ఉంటాం. ఈ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ముఖ్యమంత్రిగారు ఏమైనా ఉంటే నా మీద చూపండి, కార్యకర్తల మీద కాదు” అని విజయ్ (Vijay) పేర్కొన్నాడు. మరి ఈ విషయమై ఇతర రాజకీయ పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాలి.
ఇకపోతే.. ఈ ఘటనను పావులా వాడుకొని విజయ్ (Vijay) ఆఖరి చిత్రంగా విడుదలకానున్న “జన నాయగన్” విడుదల సమయంలో లేనిపోని సమస్యలు సృష్టించేందుకు కూడా కొన్ని వర్గాలు సిద్దమవుతున్నాయని భోగట్టా.