స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కడం చాలా అదృష్టం. అలాంటి దర్శకుడికి కథ చెప్పే అవకాశం వస్తే, అతనికి కాకుండా ఆ కథ వేరొకరికి చెబితే… ఎలా ఉంటుంది? కచ్చితంగా షాక్ అవుతారు కదా. ప్రముఖ కథానాయకుడు విజయ్ కూడా ఇలాంటి షాకే తిన్నారట. ఇటీవల జరిగిన విషయాన్ని ‘బీస్ట్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చారు విజయ్. ప్రముఖ తమిళ దర్శకుడు అల్ఫోన్సోనే ఆ షాక్ ఇచ్చిన దర్శకుడు. ఇంతకీ ఏమైందంటే?
అల్ఫోన్సో పుతేరేన్ అంటే తెలుగు వాళ్లకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫోన్సో అంటే తెలిసిపోతుంది. అతను కొన్ని రోజుల క్రితం విజయ్‌కి కథ చెబుతాను అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నారట. ఆ రోజు వచ్చి… కథ చెప్పడం మొదలుపెట్టారట. ఇంట్రెస్టింగ్గా ఉందని విజయ్ వింటుండగా.. ఈ కథ మీ కోసం కాదు అంటూ షాక్ ఇచ్చారట అల్ఫోన్సో పుతేరన్. అదేంటి నాకు కాదా అనుకుంటుండగా అసలు విషయం చెప్పారట.
నేను తీద్దామనుకుంటున్న సినిమాలో హీరో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. ఆ పాత్రకు మీ కొడుకు జేసన్ సంజయ్‌కి అయితే ఈ కథ బాగుంటుంది. ఆయన కోసమే ఈ కథ మీకు చెబుతున్నా అని అన్నారట. దీంతో ఏం జరుగుతోందనేది విజయ్ అర్థం కాలేదట. అయితే అల్ఫోన్సో చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని విజయ్ చెప్పాడు. అయితే ఆ కథ గురించి తన కొడుక్కి చెప్పారా? దానికి అతను ఏమన్నాడు లాంటి వివరాలు చెప్పలేదు విజయ్. హీరోల తనయులు హీరోలు కావడం సినిమాల్లో సహజమే.
దీనికి ఏ వుడ్ కూడా అతీతం కాదు. అలా విజయ్ కుమారుడు త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే… తన కుమారుడు హీరో అవ్వడానికి కనీసం రెండు మూడేళ్లు సమయం కావాలని అడిగాడని విజయ్ చెబుతున్నాడు. కొడుకు మనసులో ఏముందో తనకు తెలియడందని చెప్పాడు విజయ్. ప్రస్తుతం జేసన్ సంజయ్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. జేసన్ సంజయ్‌తో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు తనను కలుస్తున్నారని విజయ్ చెప్పాడు. జాసన్ హీరోగా రావాలని అనుకుంటే తనకు ఓకే అని విజయ్ అన్నాడు.