ఊపిరి తీసుకోవద్దంటున్న విక్రమ్..!

నటుడిగా ఎలాంటి పాత్రకైనా ప్రాణప్రతిష్ట చేసేంత సమర్థుడు విక్రమ్. జయాపజయాలకు అతీతంగా సాగే అతడి కెరీర్ లో భిన్నమైన పాత్రలెన్నో. ఎంతో కష్టానికోర్చి చేసిన ‘ఐ’ సినిమాకి బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం రానప్పటికీ ఆయన ప్రయోగాల బాట వీడలేదు. ఇటీవల విడుదలైన ‘ఇరుముగన్’ (తెలుగులో ఇంకొక్కడు) విక్రమ్ కి కొంత ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఈ ఊపులో విక్రమ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న హాలీవుడ్ సినిమా ‘డోంట్ బ్రీత్’. పేరుకి తగ్గట్టే ఊపిరి సలపని సస్పెన్స్ నిండిన ఈ సినిమా ఇప్పటికీ పలు చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాని విక్రమ్ రీమేక్ చేయనున్నడంటూ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే స్టీఫెన్ లాంగ్ పోషించిన అంధుడి పాత్రలో విక్రమ్ దర్శనమివ్వనున్నాడు. ఈ మాటెలా ఉన్నా హరి తెరకెక్కించనున్న ‘సామి’ సీక్వెల్ కోసం ఖాకీ కట్టేందుకు సిద్ధమవుతున్నాడు విక్రమ్. 2003లో వచ్చిన ఈ సినిమాకి పదమూడేళ్ల తర్వాత సీక్వెల్ రానుండటం విశేషం. ఈ సినిమా అయినా విక్రమ్ కి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus