తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతి పెద్ద పార్టీగా ఎన్నికైనప్పటి నుండి మొన్న సీఎంగా విజయ్ జోసెఫ్ ప్రమాణ స్వీకారం చేసేంతవరకు తమిళ సినిమా పరిశ్రమ నుండి ఆయనకు ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ‘సోదరుడు’ అంటూ సినిమా పరిశ్రమలో ముఖ్యులు మెచ్చుకుంటూనే ఉన్నారు. సీఎంగా తీసుకున్న తొలి నిర్ణయం పట్ల కూడా పెద్ద ఎత్తున మెచ్చుకోలు కూడా వచ్చాయి. అలా పొగిడేసినవారిలో ప్రముఖ తమిళ కథానాయకుడు విశాల్ కూడా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన తీసుకున్న ఓ నిర్ణయం విషయంలో తాజాగా విశాల్ వ్యతిరేకించారు.
సీఎం విజయ్ ఇటీవల తన కేబినెట్‌కు శాఖలు కేటాయించారు. అదే ఇప్పుడు విజయ్‌ని విశాల్ వ్యతిరేకించడానికి కారణమైంది. సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్ మోహన్‌ను నియమించడాన్ని విశాల్ వ్యతిరేకించాడు. సినిమా పరిశ్రమ గురించి తెలియనివారికి ఆ మంత్రిత్వ శాఖను కేటాయించడం సరికాదనేది విశాల్ వాదన. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. సీఎం విజయ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్కూళ్లు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు మూసివేతకు ఆదేశాలు ఇవ్వడంపై విశాల్ ప్రశంసలు కురిపించాడు.
అయితే సినిమాటోగ్రఫీ మంత్రి నియామకం విషయంలో అసంతృప్తిని వెలిబుచ్చారు. రాజ్ మోహన్‌కు ఈ శాఖ కేటాయించడం నిరుత్సాహ పరిచింది. ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న సినిమా రంగం సమస్యలను, విజ్ఞప్తులను అనుభవమూ లేని వ్యక్తికి ఎలా తెలియజేయగలం? 30 ఏళ్ల సినీ అనుభవం ఉన్న వ్యక్తిగా మీకు (విజయ్‌ను ఉద్దేశించి) క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసు విశాల్ ప్రస్తావించారు. అలాగే ఇండస్ట్రీ చెందిన విజ్ఞప్తులను సీఎం విజయ్ ముందుంచారు విశాల్.
ప్రభుత్వ టికెటింగ్ విధానాన్ని తీసుకురావాలని కోరిన విశాల్ దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. చిన్న చిత్రాలకు ఇచ్చే సబ్సిడీని పెంచాలన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వినతి పత్రం రూపంలో ఇవ్వొచ్చు కానీ, 9 ఏళ్లుగా ఇలాంటి వినతులు ఇస్తూనే ఉన్నామని విశాల్ అన్నారు. అయితే రాజ్ మోహన్‌ను కించపరచడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు.