ఓటర్

“ఆచారి అమెరికా యాత్ర” కంటే ముందుగానే షూటింగ్ మొదలై.. కారణాంతరాల వలన కొన్ని నెలలపాటు షూటింగ్ ఆగిపోయి, ఇంకొన్నాళ్ళేమో రిలీజ్ అవ్వడం కోసం కష్టాలు పడి.. ఆఖరికి చిత్ర కథానాయకుడు విష్ణు స్వయంగా సినిమా విడుదల ఆపేయాలని హడావుడి చేసిన సినిమా “ఓటర్”. సినిమా ట్రైలర్ కంటే ఆ చిత్ర దర్శకనిర్మాతలు పెట్టిన ప్రెస్ మీట్స్ కే ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే గొడవలు ఏస్థాయిలో జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇంత హల్ చల్ అనంతరం విడుదలైన చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొంది అనేది చూద్దాం..!!

కథ: అమెరికా నుంచి ఓటు వేయడానికి వచ్చిన గౌతమ్ (విష్ణు మంచు) దారిలో ఒకమ్మాయిని (సురభి) చూస్తాడు. కట్ చేస్తే.. అదే అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాడు. అప్పటికే మెంటల్ గా సురభిని ప్రేమికురాలిగా, భార్యగా ఫిక్స్ అయిపోయిన గౌతమ్.. సురభికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలియడంతో ఆమెను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ఆమె వెంటపడుతుంటాడు.ఆ క్రమంలో తమ ఏరియా ఎమ్మెల్యే (పోసాని కృష్ణమురళి) ఇచ్చిన హామీలు నెరవేరేలా చేస్తే తాను గౌతమ్ ను పెళ్లాడతానని చెబుతుంది.

అప్పట్నుంచి ఎమ్మెల్యే పోసాని ఇచ్చిన హామీలన్నీ నెరవేరేలా చేయడమే ధ్యేయంగా పెట్టుకొన్న గౌతమ్.. ఆ క్రమంలో మినిస్టర్ ఆదిత్య శ్రీపతి (సంపత్ రాజ్)తో తలపడాల్సి వస్తుంది. మినిస్టర్ ను ఎదుర్కొని ఒక కామన్ ఓటర్ ఎలా ఎదురు నిలిచాడు? చివరికి ఏం సాధించాడు? అనేది “ఓటర్” కథాంశం.

నటీనటుల పనితీరు: మంచు విష్ణు చాలా రోజుల తర్వాత కనిపించడం వలన కొత్తగా కనబడ్డాడో లేక సినిమాలో నిజంగానే కొత్తగా కనిపించాడో తెలియదు కానీ.. మొత్తానికి కాస్త డిఫరెంట్ గా కనిపించాడు. కానీ.. ఆ డైలాగ్ డెలివరీ & పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. చాలా పవర్ ఫుల్ డైలాగ్ ను కూడా పేలవంగా చెప్పి.. ఆ సన్నివేశంలోని ఇంపాక్ట్ ను కిల్ చేయడంలో విష్ణు సిద్ధహస్తుడనే విషయం మరోమారు ప్రూవ్ అయ్యింది.

సురభి కాస్త అందంగా కనిపించింది, అలాగే నటిగానూ మంచి మార్కులు సంపాదించుకొంది. కథలో ఆమె పాత్ర ప్రాముఖ్యత బాగుంది. ఆమె గ్లామర్ సినిమాకి ఉన్న అతి తక్కువ ప్లస్ పాయింట్స్ లో ఒకటి.పోసాని పాత్ర మన పాల్ ను ఇమిటేట్ చేసినట్లుగా ఉంటుంది. అలాగే ఇండైరెక్ట్ గా చాలామంది పొలిటీషియన్స్ ను ట్రోల్ చేసే విధంగా ఆయన పాత్ర ఉండడం విశేషం.అవినీతి మినిస్టర్ ఆదిత్యగా సంపత్ రాజ్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఎల్.బి.శ్రీరామ్, నాజర్ పాత్రలు సినిమాకి ప్లస్ అయ్యాయి.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు కొత్తగా చెప్పాలనుకొన్న పాయింట్ బాగుంది, ఆలోచనాత్మకంగానూ ఉంది. కానీ.. సరైన స్క్రీన్ ప్లే & మోటివ్ లేని కారణంగా ఆ పాయింట్ వేస్ట్ అయిపోయింది. ఇదే సినిమాను ఇంకాస్త పెద్ద స్టార్ క్యాస్ట్ తో తీస్తే ఆ పాయింట్ కు మంచి రీచ్ ఉండేది. దర్శకుడిగా కార్తీక్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రాలేదనిపిస్తుంటుంది. నటీనటుల పనితీరు కావచ్చు, ప్రొడక్షన్ వేల్యూస్ కావచ్చు.. సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అందువల్ల కథగా చెప్పుకోవడానికి “ఓటర్” సినిమాలో కనిపించిన దమ్ము.. సినిమాలో కనిపించదు. దాంతో సినిమా అటు ఆలోజింపజేయలేక, ఇటు ఆహ్లాదపరచలేక మధ్యస్తంగా ఉండిపోతుంది.

ఇక మంచు విష్ణు నానా యాగీ చేసిన “అసెంబ్లీ రౌడీ” స్క్రీన్ ప్లే అనేది సినిమాలో ఎక్కడుందో ఎంత వెతికినా కనిపించదు. “ఒక్క 30% సపోర్ట్ ఉండాలి” అనే ప్రజల సపోర్ట్ సీన్ తప్పితే సినిమా మొత్తంలో “అసెంబ్లీ రౌడీ” కాన్సెప్ట్ అనేది ఎక్కడా కనిపించదు. మరి సినిమా ఆపేయాలని మంచు విష్ణు ఎందుకు గొడవ చేశాడు, దర్శకుడ్ని రెండు కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వమన్నాడు అనేది ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న. తమన్ సంగీతం, రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ రెగ్యులర్ గానే ఉన్నాయి.

విశ్లేషణ: చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. చెప్పిన విధానం ఆకట్టుకొనే విధంగా లేకపోవడం కారణంగా ఫెయిలైన సినిమాల జాబితాలోకి చేరే చిత్రం “ఓటర్”.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus