మన ముందుకు ఓ సినిమా వచ్చినప్పుడు అందులోని హీరోను చూసి ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. ఆ పాత్ర అంతకుముందు ఎంతమంది హీరోలను దాటి ఈ హీరో ముందుకు వచ్చింది అనే పాయింట్ కచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే సినిమా కథలు ఎన్నో చేతులు మారి, ఎందరో చెవులకు చేరి ఆఖరికి ఆ హీరో దగ్గరకు వచ్చి ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్‌లో కథ ఓకే అయిపోయి, సినిమా మారిపోయే సందర్భాలు చాలా తక్కువ. కొన్నిసార్లయితే కొంత షూట్ అయ్యాక హీరో మారిపోతుంటాడు కూడా. యంగ్ హీరో తేజ సజ్జాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు తేజ సజ్జా. ఆ సినిమాకు ముందు హీరోగా కొన్ని సినిమాలు చేసినా.. ఈ సినిమా ఇచ్చినంత పాపులారిటీ ఏదీ ఇవ్వలేదు. హీరోగా మారకముందు తేజ కూడా అందరి కుర్రాళ్లలానే కెరీర్లో ఇబ్బందులు పడ్డాడు. అవకాశాల కోసం దర్శక నిర్మాతల చుట్టూ తిరిగాడు. ఆ సమయంలో ఒక పెద్ద దర్శకుడు ఆశ చూపి దెబ్బ కొట్టాడట. తన కొత్త సినిమా ‘మిరాయ్’ విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకొచ్చాడు తేజ సజ్జా.
హీరో అవ్వాలనుకున్నపుడు తాను ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పిన తేజ… మోసాలు, రిజెక్షన్లు, అవమానాలు చూశానని తెలిపాడు. తనను మోసం చేసిన వాళ్లలో పెద్ద మనుషులు ఉన్నారని కూడా తెలిపాడు. ఒక స్టార్ డైరెక్టర్ అయితే తనకు కథ చెప్పి షూటింగ్ మొదలు పెట్టి 15 రోజులు అయ్యాక వేరే హీరోను తీసుకున్నారట. తన కంటే ముందు ఆ హీరోకు కథ చెప్పిన ఆ దర్శకుడు అతనికి సీన్స్ చూపించడం కోసం తనతో మాక్ షూట్ చేశాడని తర్వాత తెలిసిందని తేజ సజ్జా గతం గుర్తు చేసుకున్నాడు.
యంగ్ హీరోకు అందులోనూ పరిశ్రమతో ఎప్పటి నుండో పరిచయం ఉన్న తేజ సజ్జాకు ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే ఆసక్తికరమే. అందులోనూ పెద్ద హీరో అంటున్నాడు కాబట్టి ఎవరది, ఆ మోసం ఏంటి అనేది తేలాల్సిన విషయమే. అయితే ఆ విషయం ఆయనే చెప్పాలి.