పక్క రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం అనకే పోతే ఇంకేమంటారు.. అయినా ఆ రాష్ట్రం తెలంగాణకు పక్కనే ఉంది కదా అని కొందరు విమర్శిస్తుంటే.. పుట్టి పెరిగి, ఇంతవాడిని చేసిన రాష్ట్రం.. మీకు రాజకీయంగా పుట్టుకను ఇచ్చి రాష్ట్రం.. మీ తమ్ముడిని డిప్యూటీ సీఎంను చేసిన రాష్ట్రం గురించి తక్కువ చేసి మాట్లాడతారా అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరేమో ఆయన పక్క రాష్ట్రమే అన్నారు కదా.. అదేమైనా పగోడి రాష్ట్రం అన్నారా.. అంటూ వెనకేసుకొస్తున్నారు. ఇందులో ఎవరి వాదన ఎంత వరక కరెక్ట్ అనేది పక్కన పెడితే.. చిరంజీవి లేవనెత్తిన పాయింట్ పక్కదారి పట్టేస్తోంది.
తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాలు పురస్కరాలు ఇచ్చి ప్రోత్సహించాలి అనేది చిరంజీవి ఆ రోజు చెప్పాలనుకున్న అంశం. ఈ మాట ఆయన ఇప్పుడు కాదు తెలుగు రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు అయినప్పటి నుండి ఇదే మాట అంటున్నారు. ఆయన పోరాటం, ఆయనతో పాటు మరికొంతమంది సినిమా పెద్దలు చేసిన కృషే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డుల పేరిట తెలుగు సినిమాకు దక్కాయి. ఇప్పుడు అదే ఉత్సాహంలో ఆంధ్రప్రదేశ్ కూడా అవార్డులు ఇస్తే బాగుంటుంది అని అన్నారు. ఆయన అన్నారని కాదు కానీ.. అసలు ఏపీలో నంది అవార్డుల విషయం ఎంతవరకు వచ్చింది.
కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రాగానే తెలుగు సినిమా పరిశ్రమ గురించి ప్రస్తావన వచ్చింది. దీని కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు, చేసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆ తర్వాత ఓసారి శాసనసభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. కమిటీ సభ్యుల వరుస, పిలుపులు తదితర అంశాల మీద నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా మాట్లాడారు. రీసెంట్‌గా ఓసారి మంత్రి దుర్గేశ్ కూడా దీని గురించి మాట్లాడారు కూడా. అంటే ప్రభుత్వం ఈ విషయంలో సిద్ధంగానే ఉంది.
ఇక ఆ మధ్య ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడదాం అని అనుకున్నామని, అటువైపు నుండి అప్పాయింట్‌మెంట్ కూడా ఫిక్స్ చేశారని చెప్పారు. అయితే ఆయన్ని కలుద్దామని అందరూ అనుకునేలోపు కొంతమంది సినిమా పరిశ్రమకు చెందిన వారు షూటింగ్‌లు ఉన్నాయని రాలేదని దిల్ రాజు చెప్పారు. ఆ తర్వాత కూడా వీరంతా కలసి వెళ్లినట్లు లేదు. ఈ లెక్కన నంది అవార్డుల పని ఎక్కడ ఆగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చిరంజీవి మాటల నేపథ్యంలోనైనా టాలీవుడ్ జనాలు – ఏపీ ప్రభుత్వం నంది విషయంలో ముందడుగు వేస్తాయేమో చూడాలి.