ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లో చాలా సెక్షన్లు ఉంటాయి. అందులో అందరికీ తెలిసిన సెక్షన్లను వేలు మీద లెక్కెట్టొచ్చు. అయితే ఎవరికీ తెలియని సెక్షన్ల గురించి అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు. అలా ఇటీవల ‘నాంది’లో ఐపీసీ 211 గురించి వివరించారు. ఇప్పుడు శంకర్ -రామ్చరణ్ సినిమాలోనూ ఇలాంటి పనే చేయబోతున్నారట. అయితే ఇది శంకర్ సినిమా కదా… అంతకుమించి అనేలా ఉండబోతోందని టాక్. శంకర్ సినిమాలో రామ్చరణ్ ప్రభుత్వ అధికారిగా పని చేస్తారని వార్తలొచ్చాయి.
అనుకున్నట్టుగా సినిమా ఓపెనింగ్ రోజు విడుదల చేసిన పోస్టర్లో అందరూ ప్రభుత్వ అధికారులుగా కనిపించారు. దీంతో అప్పటివరకు వచ్చిన వార్తలు కరెక్టే అని తేలిపోయింది. అదే సమయంలో ప్రభుత్వ అధికారి అయిన చరణ్… తర్వాత రాజకీయాల్లోకి వస్తాడని అని వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ వార్తలు ఆగిపోయాయి. తాజాగా ప్రభుత్వ అధికారిగా చరణ్… ఐపీసీ సెక్షన్ల లెక్కలు బయటకు తీస్తాడని అంటున్నారు. ఐపీసీలో చాలామందికి తెలియని సెక్షన్ల గురించి శంకర్ అండ్ టీమ్ పరిశోధన చేసి వివరాలు సేకరించిందట.
వాటిని సినిమాలో చూపిస్తారట. వాటిని అడ్డం పెట్టుకొని అక్రమార్కులు ఎలా ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేస్తున్నారనే విషయాల్ని శంకర్ తనదైన శైలిలో చూపిస్తారని వార్తలొస్తున్నాయి.