Thalaivii Review: తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

సౌత్ సినిమా ఇండస్ట్రీతోపాటు తమిళనాడు రాజకీయాలను శాసించిన ఐరన్ లేడీ జయలలిత సినీ మరియు రాజకీయ జీవితం కథాంశంగా తెరకెక్కిన చిత్రం “తలైవి”. బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కడమే కాక అదే విధంగా నేడు విడుదలైంది. మరి జయలలిత జీవితాన్ని ఏ.ఎల్.విజయ్ ఎంత రియలిస్టిక్ గా చూపించాడో చూద్దాం..!!

కథ: జయలలిత జీవితంలోని చేదు సంఘటనల్లో ఒకటైన అసెంబ్లీ ఘటనతో “తలైవి” కథ మొదలవుతుంది. జయలలిత (కంగనా రనౌత్) తన తల్లి భాగ్యశ్రీ ప్రోద్భలంతో ఎమ్జీయార్ (అరవింద స్వామి)తో హీరోయిన్ గా మొదటి సినిమాలో నటిస్తుంది. సినిమాతో పరిచయం ప్రేమ దాకా వెళ్ళి.. పరిణయం దగ్గర ఆగిపోతుంది. ఆ తర్వాత ఎమ్జీయార్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడంతో జయలలిత మెంటల్ గా స్ట్రగుల్ అవుతుంది. సినిమా ఆఫర్లు కూడా కోల్పోతుంది.

ఆ తర్వాత సడన్ గా ఎమ్జీయార్ స్వయంగా జయలలితను పాలిటిక్స్ లోకి స్వాగతిస్తాడు హీరోయిన్ జయలలిత “అమ్మ”గా మారుతుంది. తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని కరుణానిధిని ఎలా ఎదిరించి, ఎలక్షన్స్ లో విజయం సాధించింది? అనేది “తలైవి” కథాంశం.

నటీనటుల పనితీరు: “ఫ్యాషన్, తను వెడ్స్ మను” తర్వాత కంగనా నటిగా పరిణితి చెందిన ప్రదర్శన కనబరిచిన చిత్రం “తలైవి”. “యాత్ర”లో మమ్ముట్టిలా తాను పోషించే పాత్రధారిని ఇమిటేట్ చేయకుండా ఆ పాత్రలో జీవించింది. అందుకే తెరపై కనిపించేది కంగనా అయినా.. ఆమెలో జయలలిత ధ్వనిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. కంగనా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనొచ్చు.

కంగనాను బీట్ చేసే స్థాయిలో ఎమ్జీయార్ గా అరవింద స్వామి అదరగొట్టాడు. ఎమ్జీయార్ బాడీ లాంగ్వేజ్, హావభావాల ప్రదర్శన, మ్యానరిజమ్స్ అన్నీ దించేశాడు. సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. నాజర్, సముద్రఖని, పూర్ణ, మధుబాల, భాగ్యశ్రీ తదితరులు తమ తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడిగా ఏ.ఎల్.విజయ్ స్క్రీన్ ప్లే విషయంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. “మదరాసు పట్టణం” అనంతరం అతని స్క్రీన్ ప్లే మ్యాజిక్ మళ్ళీ “తలైవి”లో కనిపించింది. టీజర్ & ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ను పాజిటివ్ గా మలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు. క్యాస్టింగ్ లోనే సగం సక్సెస్ సాధించాడు విజయ్. ప్రతి పాత్రకు పర్ఫెక్ట్ క్యాస్ట్ ను ఎంపిక చేసుకున్నాడు. వారి నుంచి పాత్రకు, సన్నివేశానికి తగ్గ నటన రాబట్టుకున్నాడు.

అయితే.. జయలలిత జీవితంలోని చాలా ముఖ్యమైన సందర్భాలను, పాత్రలను సినిమాలో ఎక్కడా చూపించలేదు. జయలలితా పోలిటికల్ ఫ్యాన్స్ ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకనో లేక అనవసరమైన రచ్చలు ఎందుకు అనుకున్నాడో ఏమో. జయలలిత పర్సనల్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిన శోభన్ బాబు పాత్ర సినిమాలో లేకపోవడం గమనార్హం.

ప్రీప్రొడక్షన్ వర్క్ పర్ఫెక్ట్ గా చేసిన కారణంగా సాంకేతికంగా ఎలాంటి లోపాలు కనిపించలేదు. జీవీ ప్రకాష్ సంగీతం, విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ ఉన్నాయి. అలాగే.. ప్రొడక్షన్ డిజైన్, డి.ఐ టెక్నికల్ గా సినిమాని టాప్ లో నిల్చోబెట్టాయి.

విశ్లేషణ: టెక్నికల్లీ “తలైవి”లో నెగిటివ్ అంశాలేమీ లేవు. కథ-కథనం కూడా బాగున్నాయి. అయితే.. “ఎన్టీఆర్” బయోపిక్ లానే ఈ సినిమా కూడా మొత్తం పాజిటివిటీనే చూపించడం అనేది కొంతమేరకు మైనస్ అని చెప్పాలి. బయోపిక్ అంటే వెలుగు-చీకటి కోణాలు రెండూ ఉండాలి. కానీ.. ఇలా ఒక వ్యక్తిని దేవుడు/దేవతలా చూపించడం అనేది పర్ఫెక్ట్ బయోపిక్ అనిపించుకోదు. అయితే.. సినిమాగా చూస్తే మాత్రం “తలైవి” ఆకట్టుకుంటుంది. కంగనా, అరవింద స్వామిల నటన ప్రదర్శన, ఏ.ఎల్.విజయ్ టేకింగ్ కోసం సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Share.