Tuck Jagadish Review: టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించగా ఒటీటీలో విడుదలవుతున్న రెండో చిత్రం “టక్ జగదీష్”. “నిన్ను కోరి” లాంటి బ్లాక్ బస్టర్ అనంతరం నాని-శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ చిత్రంపై విశేషమైన అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్ రిలీజ్ కోసం సిద్ధపడినప్పటికీ.. పరిస్థితులు సహకరించక అమేజాన్ ప్రైమ్ లో వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు ఈ చిత్రాన్ని. మరి టక్ జగదీష్ గా నాని ఏమేరకు అలరించాడో చూద్దాం..!!

కథ: భూదేవిపురంలో భూముల గొడవలు ఎక్కువ. గొడవల్లేని ఊరిని చూడాలనేది ఊరి పెద్ద ఆదిశేషు నాయుడు (నాజర్) కోరిక. తన ఇద్దరు కొడుకులు బోసు బాబు (జగపతిబాబు), జగదీష్ నాయుడు (నాని)ల ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటాడు. అయితే.. ఆదిశేషు నాయుడు ఆకస్మిక మరణానంతరం ఆయన కుటుంబంలోనే ఆస్తి తగాదాలు మొదలవుతాయి. తోబుట్టువులను పక్కనెట్టి ఆస్తి మొత్తం తానే కొట్టేయాలనుకుంటాడు బోసు బాబు. మరోపక్క వీరేంద్ర (డానియల్ బాలాజీ) ఊర్లో వాళ్ళ భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ సమస్యల సుడిగుండం నుండి తన కుటుంబాన్ని, ఊరిని టక్ జగదీష్ ఎలా కాపాడుకున్నాడు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: ఎంత నేచురల్ స్టార్ అయినప్పటికీ.. నటుడిగా నాని తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాల్సిన సమయం వచ్చింది. ఆ టక్ తప్పితే నాని స్టైలింగ్ కానీ, మ్యానరిజమ్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్కడా కొత్తదనం కనిపించలేదు. ఇలాగే కంటిన్యూ అయితే.. నాని సినిమాలు జనాలకి బోర్ కొట్టేయడం ఖాయం.

రీతువర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆమె ఇలాంటి కమర్షియల్ సినిమాలకంటే కాన్సెప్ట్ సినిమాలు చేస్తేనే మంచిది. నిండైన చీరకట్టుతో అందంగా కనిపించిందే కానీ.. ఆమె పాత్ర కథా గమనానికి ఎక్కడా తోడ్పడలేదు.

జగపతిబాబుని ఈ తరహా పాత్రల్లో చూసి జనాలకి ఎప్పుడో బోర్ కొట్టేసింది. ఈ విషయాన్ని ఆయన త్వరగా రియలైజ్ అయ్యి తన పంధా మార్చుకుంటే బెటర్. లేదంటో రోతలో కొట్టుకుపోతారు.

మంచి నటి ఐశ్వర్య రాజేష్ ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా వాడడం బాలేదు. మిగతా పాత్రధారులకు అలరించే క్యారెక్టరైజేషన్స్ లేవు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ నేపధ్య సంగీతం. సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఈ రెండే అని చెప్పాలి. సబ్జక్ట్ తో సంబంధం లేకుండా ఇద్దరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. తమన్ పాటలు సోసోగా ఉన్నాయి. ప్రవీణ్ పూడి సరిగ్గా మనసు పెడితే ఓ 30 నిమిషాల సినిమాను ఎడిట్ చేసేయొచ్చు.

దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథ-కథనంలో కొత్తదనం కొరవడింది. ఇక బేసిక్ స్టోరీలైన్ రెండేళ్ల క్రితం కార్తీ నటించగా తెలుగు-తమిళ భాషల్లో విడుదలైన “చినబాబు”ను పోలి ఉండడం గమనార్హం. అసలే పాత కథ అంటే ఆ కథను నడిపించడం కోసం శివ నిర్వాణ ఎంచుకున్న కథనం ఇంకాస్త పాతదవ్వడం కడు శోచనీయం. ఫ్యామిలీ సెంటిమెంట్స్ ను ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే రీతిలో తెరకెక్కించడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని. ఆ విషయంలో శివ నిర్వాణ దర్శకుడిగా-కథకుడిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా పండలేదు. అలాగే.. కనీసం నవ్వించలేకపోయాడు. 148 రన్ టైమ్ మరో మైనస్. అనవసరమైన ఎపిసోడ్స్ తో సినిమా మరీ సీరియల్ లా సాగింది. అలాగే.. ఆల్రెడీ “అలా మొదలైంది”లో నానికి తల్లిగా నటించిన రోహిణితో ఈ సినిమాలో అక్క పాత్ర పోషింపజేయడం కూడా సెట్ అవ్వలేదు. చెప్పుకుంటూ పోతే ఫిలిమ్ మేకర్ గా శివ నిర్వాణ చేసిన తప్పులు కోకొల్లలు.

విశ్లేషణ: ఫ్యామిలీ సెంటిమెంట్ నేపధ్యంలో తెరకెక్కిన “టక్ జగదీష్” పురాతన కథ-కథాంశంతో, ఎమోషన్స్ ను సరిగా ఎలివేట్ చేయలేక నానా ఇబ్బందులుపడుతూ.. ఒటీటీ ప్లాట్ ఫార్మ్ లో కూడా బోర్ కొట్టించింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలవ్వకపోవడం వల్ల హీరో నానికి, నిర్మాతలకి, ప్రేక్షకులకి ఎంతో మేలు జరిగిందనే చెప్పాలి. దర్శకుడిగా శివ నిర్వాణ తన పంధాను ఇప్పటికైనా మార్చుకుంటే కనీసం తదుపరి చిత్రంలోనైనా కొత్తదనం కనిపించే అవకాశముంది.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Share.