సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ చూసి కథ చెప్పేసేవాళ్లు కొంతమంది ఉంటారు. చాలాసార్లు వాళ్లు చెప్పే కథలు నూటికి నూరుశాతం సరిపోతాయి. వాళ్లతో ఇండస్ట్రీకి, జనాలకు ఏం సమస్య ఉండదు. ఇక్కడ ఇంకొంతమంది ఉంటారు. ముందు చెప్పిన ప్రచార చిత్రాలు చూసి… ‘ఇది మా మనోభావాలు దెబ్బతినేలా ఉంది’ అంటూ నినాదాలు చేస్తారు. వివాదాలు సృష్టిస్తారు. తీరా ఆ సినిమా విడుదలయ్యాక… చప్పగైపోతారు. అంతకుముందు అరిచి గోల చేసింది మరచిపోతారు. ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ విషయంలోనూ అంతేనా…
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ టీజర్ వచ్చినప్పుడు సమంతను ఆఖరి సీన్లో చూపించారు. దీంతో ఆమె పాత్ర ఏంటి అనేది అర్థం కాలేదు. అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అని మాత్రం చూపించారు. కొన్నాళ్లకు ట్రైలర్ వచ్చింది. దీంతో అసలు రచ్చ మొదలైంది. ఇందులో సమంత రాజీ అనే తమిళ అమ్మాయిగా కనిపిచనుందని తెలిసింది. అయితే ఆమె పాత్ర ఓ ఉగ్రవాది. దీంతో తమిళనాడులో ఓ వర్గం ఆందోళనలు మొదలుపెట్టింది. ఓ తమిళమ్మాయిని ఉగ్రవాదిగా ఎలా చూపిస్తారు, సిరీస్‌ను బ్యాన్ చేయండి అంటూ నిరసనలు చేపట్టింది. సమంతను చాలామంది సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూనే ఉన్నారు.
ఇంత జరుగుతున్న చిత్రబృందం కామ్‌గానే ఉంది. సిరీస్ చూశాక మీ అభిప్రాయాలు చెప్పండి అంటూ కూల్‌గానే చెప్పుకొచ్చింది. కానీ ఆందోళనలు ఆగలేదు. వాటి మధ్యే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వచ్చింది. సిరీస్‌ను చూసినవారంతా సమంత సూపర్.. అంటూ కామెంట్లు, కాంప్లిమెంట్లూ ఇచ్చేస్తున్నారు. అయితే తమిళ తంబీలు గమ్మునున్నారు. కారణం ఈ వెబ్ సిరీస్‌లో తమిళ జాతినీ, భాషనీ. చరిత్రనూ ఇబ్బందిపెట్టే పాయింట్లు ఏవీ లేకపోవడమే. నిజానికి ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాక ఈ గొడవలు ఎక్కువ అవుతాయనుకున్నారంతా. కానీ పరిస్థితి రివర్స్ అయ్యింది. మరోసారి ‘మనోభావాలు’ బ్యాచ్ ముసుగేశారు.
ఇక్కడే మనం ఓ పాత మాట గుర్తుకు తెచ్చుకోవాలి. ‘వాళ్లంతా నా సినిమాను ఫ్రీగా చూసి వెళ్లిపోతారు’ అని ఓ స్టార్ హీరో ఈ ‘మనోభావాల’ బ్యాచ్‌కు గతంలో చురకలు అంటించారు. సినిమా చూడకుండానే అందులో మా వర్గానికి వ్యతిరేకంగా ఏదో ఉంది అంటూ ఆందోళన చేసి… ముందుగా షో వేస్తే చూసి వెళ్లిపోతారు. సినిమాలో ఏమీ లేదని తెలిశాక ముక్క మాట్లాడరు అంటూ ఆ హీరో చాలా రోజుల క్రితం అన్నారు. ఇప్పుడు సమంత విషయంలోనూ అంతే కదా.