‘కల్కి 2’ సినిమా నుండి ప్రముఖ నటి దీపిక పడుకొణె బయటకు వచ్చేసింది. మామూలుగా అయితే ఈ విషయం చాలా పెద్ద సెన్సేషన్ అని చెప్పుకోవాలి. కానీ ఆమె ఇటీవల కాలంలో ఎగ్జిట్ ఇచ్చిన రెండో పెద్ద సినిమా కావడంతో అంత ఆసక్తి లేకుండా దీనిపై చర్చ జరుగుతోంది. ఆ సినిమా నుండి బయటకు రావడానికి ఆమె చెప్పిన కారణాలే.. ఈ సినిమాకు కూడా వర్తిస్తాయి అని వార్తలు రావడమే దీనికి కారణం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఇప్పటికిప్పుడు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం లేని ఈ సినిమా నుండి దీపిక తప్పుకుంది అని ప్రకటన ఎందుకు వచ్చినట్లు?
‘కల్కి 2’ సినిమా గురించి ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఈ సినిమాను ఇప్పట్లో ప్రారంభించే అవకాశం లేదు అన్నట్లుగా మాట్లాడారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని కీలక పాత్రధారులు ఇప్పుడు ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారని.. వారంతా ఫ్రీ అయ్యాక ‘కల్కి 2’ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. దీనికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉందని ఓ అంచనా వేస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే ప్రభాస్ చేతిలో ఇప్పుడు ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్), ‘ది రాజా సాబ్’, ‘సలార్ 2’ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ అవ్వాలంటే చాలా టైమ్ పడుతుంది. ఇక కమల్ హాసన్ పరిస్థితి కూడా అంతే.
మరి ఎప్పుడో మొదలవ్వబోయే సినిమా గురించి ఇప్పుడు చర్చలు జరిగి దీపిక ఎందుకు సినిమా నుండి బయటకు వచ్చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. పోనీ ఆమెకు ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు, సౌత్ సినిమాలు నటించడం ఇష్టం లేదు అని అనుకుంది అనుకుంటే.. అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో నటిస్తోంది. అంటే ఆ సినిమా విషయంలో దర్శకుడు అట్లీ, నిర్మాణ సంస్థకు ఆమె ఎలాంటి రూల్స్ పెట్టలేదు అనైనా అనుకోవాలి. లేదంటే వాళ్లు ఆ ‘రూల్స్’కి ఓకే చెప్పారు అనైనా అనుకోవాలి. ఏంటా రూల్స్ అనేది మీకు తెలుసు.
దీపిక తన పారితోషికాన్ని 25 శాతం పెంచిందని, తనతో పాటు వచ్చే సిబ్బందికి ఫైవ్ స్టార్ హోటల్‌లో సదుపాయాలు కల్పించాలని కోరిందని ఓ టాక్ నడిపిస్తున్నారు. షూటింగ్‌కు రోజుకు 7 గంటలు మాత్రమే హాజరవుతానని కూడా కండీషన్ పెట్టిందట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. ఈ నిబంధనలు ఆమె అన్ని సినిమాలకు తప్పక పెడుతుంది. మరి అట్లీ – అల్లు అర్జున్ టీమ్‌కి కూడా ఇవే పెట్టిందట. ఒకవేళ పెట్టి ఉంటే ఇప్పుడొస్తున్న పుకార్లు నిజమే. అన్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ పోస్ట్ చేశారు.
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కృష్ణుడి ఎంట్రీ సీన్ అది. ‘కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే..’ అని అశ్వత్థామకు కృష్ణుడు చెప్పే డైలాగ్ ఉంది. దీన్ని షేర్ చేస్తూ ‘జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు’ అని రాసుకొచ్చారు. ఇది ఎవరి కోసం రాశారో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.