ప్రస్తుతం ఇండియన్ సినిమాలో రామాయణం ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకటి నేరుగా రామాయణం అని చెప్పి తీస్తుంటే.. మరో సినిమాను రాముడి పాత్ర చుట్టూ తెరకెక్కిస్తున్నారని సమాచారం. అవే నితీశ్ తివారి ‘రామాయణ’ కాగా.. మరొకటి ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా. ఈ రెండు సినిమాల కథ మధ్య పోలికలేంటి అనేది ఇప్పుడు పాయింట్ కాదు. సినిమా ప్రచారంలో కామన్‌గా రన్ అవుతున్న ఆ పాయింటే ఇప్పుడు డిస్కషన్ పాయింట్‌గా మారింది.
‘రామాయణ’ సినిమా ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. అందులో చూపించిన సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలా ఎలా తీశారు, అలా ఇలా తీశారు అంటూ ట్రైలర్‌ను పాయింట్ టు పాయింట్ ఏకిపారేసిన వారు ఉన్నారు. ఈ విశ్లేషణలో ఎక్కువ మంది ప్రస్తావించిన అంశం.. ఎక్కువ మంది ప్రశ్నలు రేకెత్తించిన అంశం ‘హనుమంతుడు ఎవరు?’. అవును ఈ సినిమాలో ఆంజనేయుడు పాత్ర ఉన్నా ట్రైలర్‌లో చూపించలేదు. ఆ పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక మరో రామాయణ ‘వారణాసి’ సంగతి చూస్తే.. ఈ సినిమాలో రాముడిగా మహేష్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. రాముడు ఉన్నాడు కాబట్టి హనుమంతుడు కూడా ఉంటాడు అనేది క్లియర్ పాయింట్. ఇప్పటివరకు సినిమా టీమ్ నుండి ఆ పాత్ర గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. లీకులు కూడా రావడం లేదు. దీంతో ఎందుకు రెండు సినిమాల్లో హనుమంతుడు ఎవరు అనేది బయటకు చెప్పడం లేదు, చెప్పినా ప్రచారం చేయడం లేదు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘రామాయణ’ సినిమాకు సంబంధించి హనుమంతుడు పాత్ర కోసం ప్రత్యేకంగా ఓ టీజర్ రిలీజ్ చేస్తారని టాక్. ఇక ‘వారణాసి’ సినిమా విషయానికొస్తే.. ఇంకా ఆ పాత్ర కోసం ఎవరినీ ఓకే చేయలేదు అని చెబుతున్నారు. ఆ విషయంలో జక్కన్న త్వరలో నిర్ణయం తీసుకుంటారని టాక్.