మణిరత్నం ఎందుకని నానీని వద్దనుకొన్నాడు ?

  • October 11, 2017 / 07:00 AM IST

ఒక్కసారి స్టార్ డమ్ వచ్చాక హీరోలు పరాయి హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ లు ఇవ్వడానికి ఇష్టపడతారేమో కానీ.. పొరపాటున కూడా డబ్బింగ్ జోలికి వెళ్లరు. కానీ.. ఒక దర్శకుడిగా తనకు మణిరత్నం మీద విపరీతమైన గౌరవం ఉండడం, తాను కూడా కెరీర్ ను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి ఉండడంతో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన “ఒకే బంగారం” సినిమాలో హీరో పాత్రధారి అయిన దుల్కర్ సల్మాన్ పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పాడు నాని. ఆ తర్వాత మణిరత్నం ఓ సినిమా కోసం నానీని ఎంపిక చేసుకొన్నాడవే వార్తలు రావడంతో.. “ఓహో నాని అందుకే డబ్బింగ్ చెప్పాడా?” అనుకొన్నారందరూ.

కట్ చేస్తే.. ఆ ప్రొజెక్ట్ సెట్స్ కు వెళ్లకుండానే క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత మణిరత్నం “చెలియా” సినిమా తీయడం, ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మరో మల్టీ స్టారర్ కు శ్రీకారం చుట్టాడు. తమిళం నుంచి శింబు, విజయ్ సేతుపతి, అరవిందస్వామి, మలయాళం నుంచి ఫహాద్ ఫజిల్, కథానాయికలుగా ఐశ్వర్య రాజేష్, జ్యోతికలు నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు నుండి ఒక్కరూ లేకపోవడం బాధాకరం. మణిరత్నం ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుందన్న విషయం తెలిసీ.. తెలుగు హీరోను మాత్రం ఎన్నుకోకపోవడం పట్ల తెలుగు సినిమా అభిమానులు మణిరత్నంపై కాస్త గుర్రుగా ఉన్నారు. తన సినిమాలను తెలుగులోనూ విడుదల చేసుకొంటూ కాసులు కొల్లగొట్టే మణిరత్నం తెలుగు హీరోలను మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. మరి ఈసారి ఏ తెలుగు హీరోని తన సినిమాలోని హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పమని అడుగుతాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus