ఏదో యథాలాపంగా చేసిన కామెంట్లు కావవి, పర్‌ఫెక్ట్‌గా కాన్సియస్‌నెస్‌తో చేసిన కామెంట్లే. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో ఆ చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అలా అని వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి అనలేదు కూడా. సినిమా తెరకెక్కే విధానం గురించి, అందులో వాడిన సాంకేతికత గురించి మాట్లాడాడు ఆ హీరో. దీంతో అసలు ఎవరిని ఉద్దేశించి, ఏ సినిమాను ఉద్దేశించి నిఖిల్ ఈ మాటలు అన్నాడు అనేదే ఇక్కడ ప్రశ్న. ఇదంతా ‘స్వయంభూ’ సినిమా ప్రచారంలో భాగంగా నిఖిల్ చేసిన కామెంట్ల పర్యవసానమే.
కొన్ని రోజుల క్రితం యూట్యూబ్‌లో ‘స్వయంభూ’ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ టీజర్‌ను యూట్యూబ్‌లో రీఅప్‌లోడ్ చేసిన నేపథ్యంలో ఆ విషయాన్ని వెల్లడించడానికి ‘ఎక్స్’లో తాజాగా ఓ పోస్టు పెట్టాడు. ఇప్పుడు అదే చర్చనీయాంశమైంది. ఏ సినిమాని/ ఎవరిని ఉద్దేశించి అలా అన్నాడో తెలియదు కానీ.. సంక్రాంతికి వచ్చిన ఓ సినిమా గురించే అన్నాడు అని అంచనా వేస్తున్నారు నెటిజన్లు. సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఇప్పుడు టీజర్‌ను మళ్లీ అప్‌లోడ్ చేశామని నిఖిల్ తెలిపారు.
మరింత క్వాలిటీతో రీఅప్‌లోడ్ చేసిన టీజర్‌ను చూడమని కోరిన నిఖిల్.. అక్కడితో ఆగకుండా రీసెంట్‌గా వచ్చిన ఓ సినిమాలోలాగా మా చిత్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించలేదు అని కూడా అన్నాడు. మరి నిఖిల్ అలా చెప్పిన సినిమా టీమ్‌కి, ఈ సినిమా టీమ్‌కి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? అందుకే నిఖిల్ అలా అన్నాడా అనేది నిఖిల్‌కే తెలియాలి. ఇప్పటికే సినిమా రంగంలోనూ ఏఐ వినియోగం ఎక్కువవుతోంది, ఒరిజినాలిటీ తగ్గుతోంది అని వ్యాఖ్యలు వస్తున్న వేళ నిఖిల్ కామెంట్స్ పెద్ద ప్రభావమే చూపిస్తాయని చెప్పొచ్చు.
అన్నట్లు ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లోనూ ‘స్వయంభు’ కోసం ఏఐని వాడలేదని నిఖిల్ చెప్పడం గమనార్హం. ఏ సీన్ చూసినా ఇది ఏఐతో, టెక్నాలజీతో చేసిందేమో అనే డౌట్స్ రావడానికి కారణం మన సినిమా పరిశ్రమే. ఇటీవల సంక్రాంతికి వచ్చిన ఓ సినిమాలో ఫేస్ స్వాపింగ్, ఏఐ లాంటివి వాడి సీన్స్ ఎడిట్ చేశారని చెప్పారు. వాటి ప్రభావమో ఏమో కానీ సినిమా ఫలితం ఇబ్బందిపెట్టింది.