‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24న సినిమాను రిలీజ్ చేస్తామని టీమ్ చెప్పేసి ప్రచారం మొదలుపెట్టింది. అయితే జులై 23న ‘జన నాయగన్’ సినిమా వస్తుండటంతో ఇప్పుడు ప్రచారం జోరు ఇంకాస్త పెంచారు. ఈ క్రమంలో ఓ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమా పేరు ప్రజల నోళ్లలో నానేలా చేస్తోంది. అలాగే మరో సినిమా హీరోహీరోయిన్లు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. మరి చెబుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘బేబీ’ సినిమాతో పెద్ద సంచలనమే సృష్టించారు దర్శక నిర్మాత సాయిరాజేష్. అప్పటికే కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ ఆనంద్‌ను ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది అంటే సినిమా సత్తా ఏంటో తెలిసిపోతుంది. అందుకేనేమో ఈ సినిమా రిలీజైన కొన్ని నెలలకే అదే హీరో హీరోయిన్లతో సాయి రాజేష్ ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమాకు స్క్రిప్టు సాయి రాజేష్‌దే కాగా.. దర్శకుడిగా రవి నంబూరి అని అనౌన్స్ చేశారు.
అయితే, సినిమా గురించి అనౌన్స్‌మెంట్ తర్వాత చాలా నెలలు ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్లే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయింది. ఈ నేపథ్యంలో సాయి రాజేశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వేరే హీరో హీరోయిన్లతో చేయాలనుకున్న మాట వాస్తవమే. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో నటులు మారిపోయారు అని చెప్పారు.
ఒక ప్రాజెక్టు అనుకుంటే.. అది రెండేళ్లయినా, మూడేళ్లయినా దానికి కట్టుబడి ఉండాలి. అది నా పద్ధతి అని, కానీ అందరూ ఇలా ఉండరు కదా అని సాయిరాజేష్ అనడం గమనార్హం. ఈ మాటలు గతంలో ఓకే చేసిన నటీనటులు విని.. ఏమన్నా రిప్లై ఇస్తారేమో చూడాలి.