పోలిటికల్ మల్టీ స్టారర్ హిట్ అవుతుందా ?

  • January 4, 2018 / 01:42 PM IST

రాజకీయం పట్ల కనీస స్థాయి అవగాహన లేనివాడు కూడా సోషల్ మీడీయాలో పొలిటీషియన్స్ మీద, ప్రెజంట్ పాలిటిక్స్ మీద కామెంట్స్ చేయడం అనేది ఫ్యాషన్ అయిపోతున్న తరుణంలో యువత రాజకీయం అంటే మురికి గుంటలా చూడడం మొదలెట్టింది. నిజమే అది మురికి గుంటే, కానీ దాన్ని ఎవరో ఒకరు కడగాలి కదా, లేదంటే అయిదేళ్లపాటు ఆ మురికి గుంటలోనే ఉండాల్సి వస్తుంది అనే విషయాన్ని వారు ఎందుకు గ్రహించడం లేదో అర్ధం కావడం లేదు. ఆటామిక్ సైన్స్ గురించి చదివే యువకులున్న మన భారతదేశంలో పోలిటికల్ సైన్స్ చదవడం పక్కన పెడితే కనీసం పట్టించుకొనేవారు తక్కువైపోయారు. అలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో పవన్ పోలిటికల్ ఎంట్రీ పెను ప్రకంపనలు సృష్టించింది, యువతను రాజకీయాలవైపుకు తిప్పడంలో పవన్ కళ్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. కన్నడ రాష్ట్రంలో ఉపేంద్ర సొంత పార్టీ పెట్టి అక్కడి యువకులను చైతన్య పరిచే బాధ్యత తన నెత్తి వేసుకొన్నాడు. ఇక తమిళనాట ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ బాధ్యతను తీసుకొని ఇటీవల తన పోలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.

ఇలా ముగ్గురు పాపులర్ మరియు యువతను ప్రేరేపించగల నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది స్వాగతించదగిన విషయమే. అయితే.. ఇక్కడ మరో సమస్య ఉంది. ఈ ముగ్గురు యాక్టర్ టర్నడ్ పొలిటీషియన్స్ ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అవుతారా లేదా అనే విషయం పక్కన పెడితే కనీసం తమ ఉనికిని చాటుకోగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. రజనీకాంత్ కు ఎంతటి భారీస్థాయి చరిష్మా ఉన్నప్పటికీ.. తమిళనాట జరుగుతున్న రాజకీయ రచ్చను దృష్టిలో పెట్టుకొంటే ఆయన ఒక రాజకీయనాయకుడిగా రాణించడం కష్టమే అది కూడా 70 ఏళ్ల వయసులో ఇంకా కష్టం అనేది అర్ధమవుతూనే ఉంది. ఇక కన్నడ నాట కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి గెలిచే రాజకీయనాయకులు పదుల సంఖ్యలో ఉన్నారు, ఆ పోటీలో కేవలం ప్రజల మీద నమ్మకంతో వారికి మంచి చేద్దామనే ఉద్దేశ్యంతో పోలిటిక్స్ లోకి వస్తున్న ఉపేంద్ర కనీసం డిపాజిట్లైనా వస్తాయా అనే విషయంపై ఆల్రెడీ అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ అసలు ఎలెక్షన్స్ లో పోటీ చేస్తాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాననే ఆయన సిద్ధాంతం తప్పు కాకపోయినా.. ఆయన్ని నమ్ముకొన్న కోట్ల మంది యువత మరియు ప్రజల కోసం ఆయన సపోర్టింగ్ అనేది మానేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అనేది చాలా అవసరం. మరి ఈ పోలిటికల్ మల్టీస్టారర్ హిట్ అయ్యి యువతను రాజకీయాలవైపు మరల్చి దేశ భవిష్యత్ ను శాసిస్తారో లేక ఫ్లాపై మిన్నకుండిపోటారో తెలియాలంటే వచ్చే ఎలెక్షన్స్ వరకూ వేచి చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus