యువ హీరోలు చాలా వేగంగా ఉన్నారు. ఒక సినిమా చేస్తూనే రెండు మూడు సినిమాలను లైన్లో పెడుతున్నారు. అక్కినేని ప్రిన్స్ అఖిల్ మాత్రం కెరీర్ లో నెమ్మదిగానే అడుగులు వేస్తున్నారు. తొలి సినిమా ఫెయిల్ కావడమే అందుకు కారణం. రెండో సినిమాకి చాలా గ్యాప్ తీసుకొని విక్రమ్ కె కుమార్ తో హలో చేశారు. ఇది ఓ మోస్తరు విజయాన్ని అందించింది. ఇప్పుడు తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిషున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ లండన్లో ప్రారంభమయింది. 40 రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగనున్న ఈ షెడ్యూల్లో కీలక పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ ప్లే బాయ్ గా కనిపించనున్నారు.
ఈ సినిమా ప్రారంభానికి ముందే నాలుగో సినిమా కథని అఖిల్ ఫైనల్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం రచయిత గోపీమోహన్ అఖిల్ ను కలిసి ఒక కథను వినిపించాడట. ఈ కథ నచ్చడంతో వెంటనే అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే గోపీమోహన్ ఈ సినిమాకి రచయితగానే వ్యవహరిస్తారా? .. లేకపోతే దర్శకుడిగా పరిచయమవుతారా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది. నిర్మాత విషయంలోనూ ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఆ విషయాలను పక్కన పెట్టి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో గోపిమోహన్ ఉన్నారు. అఖిల్ ని తన స్క్రీన్ ప్లే తో మెప్పించి మెగా ఫోన్ అందుకుంటారేమో చూడాలి.