ప్రముఖ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ యోయో హనీ సింగ్ పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, మానసిక హింస, ఆర్ధిక మోసం కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో ‘మహిళలకు రక్షణ, గృహ హింస వ్యతిరేకం’ చట్టం కింద మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. తిస్ హజారీ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేయబడింది.
ఈ క్రమంలో కోర్టు హనీ సింగ్ కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాల్సిందిగా ఆదేశించింది. హనీ సింగ్, అతడి భార్య పేరు మీదున్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలులేకుండా.. షాలినికి అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెళ్లైన దగ్గర నుండి హనీ సింగ్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ షాలిని ఫిర్యాదులో పేర్కొంది. తాగడం, అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటి పనులు చేస్తుంటాడని హనీ సింగ్ పై సంచలన ఆరోపణలు చేసింది.
ఆర్థికంగా కూడా తనను ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో రాసుకొచ్చింది. నిజానికి వీళ్లిద్దరికీ 2011లోనే వివాహం జరిగింది. కానీ మూడేళ్ల తరువాత 2014లో ‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్యను అందరికీ పరిచయం చేశాడు. బాలీవుడ్ లో పలు భారీ ప్రాజెక్ట్స్ లో పని చేయడానికి ముందే హనీ సింగ్ పెళ్లి చేసుకున్నాడని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు.