ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు వైఎస్ కృష్ణేశ్వరరావు (71) మంగళవారం కన్నుమూశారు. గుంటూరు ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో ఉంటున్న ఆయన గత కొద్దికాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లోని ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వైఎస్ కృష్ణేశ్వరరావుగా సుపరిచితులైన ఆయన పూర్తి పేరు యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు.
1,500కు పైగా నాటకాల్లో నటించిన కృష్ణేశ్వరరావు ‘వాపస్’ ద్వారా నాటక రంగంలోకి వచ్చారు. ‘రోజూ చస్తున్న మనిషి’, ‘సంపద’, ‘పక్కింట్లో పుట్టండి’, ‘గుర్తుతెలియని శవం’ వంటి నాటకాలను రచించి, ప్రదర్శించి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. అలాగే ప్రసిద్ధ పొన్నూరు కళాపరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరు. రసఝరి అనే నాటక పరిషత్తును స్థాపించి నాటక రంగానికి చాలా ఏళ్లు సేవలందించారు. సినిమాల్లోకి నటుడిగా వచ్చే ముందు రచయితగా మోహన్‌బాబు ‘శ్రీరాములయ్య’, శ్రీహరి ‘భద్రాచలం’ సినిమాలకు కథ అందించారు.
అలాగే శ్రీహరి ‘పరశురామ్’ సినిమాకు మాటలు రాశారు. వెంకటేశ్ ‘జయం మనదేరా’ సినిమాకు రైటింగ్ టీమ్‌లో కీలకంగా పని చేశారు. మాదాల రవి సినిమా ‘నేను సైతం’కి గీత రచయితగా చేశారు. నటుడిగా ఎంట్రీ ఇచ్చాక వంశీ ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను’, ప్రవీణ్ సత్తారు ‘చందమామ కథలు’, వంశీ ‘గోపీ గోపిక గోదావరి’, అల్లరి నరేశ్ ‘నాంది’, సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ‘చందమామ కథలు’ సినిమాలో ఆయన పోషించి బిచ్చగాడు పాత్ర చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం కూడా వచ్చింది.