“సాహసం శ్వాసగా సాగిపో” లాంటి డీసెంట్ హిట్ తర్వాత నాగచైతన్య కథానాయకుడిగా రూపొందిన చిత్రం “యుద్ధం శరణం”. నాగచైతన్య స్నేహితుడు కృష్ణ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించింది. ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంపై విశేషంగా కాకపోయినా ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలున్నాయి. మరి చైతూ అండ్ టీమ్ ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అయ్యిందో లేదో చూద్దాం…!!
కథ : అర్జున్ (నాగచైతన్య) ఒక సాదాసీదా కుర్రాడు, అమ్మ-నాన్న-అక్క-చెల్లి, తాను ప్రేమించిన అమ్మాయి.. వీళ్ళే తన ప్రపంచం. జి.పి.ఎస్ ఆధారంగా ప్రయాణించగలిగే డ్రోన్ ను తయారు చేయాలన్న తన ఆశయం కోసం మంచి ఉద్యోగాన్ని కూడా మానేసి.. ఆ డ్రోన్ తయారీలో నిమగ్నమై ఉంటాడు. అంతా సంతోషంగా మురళీకృష్ణ-సీతాలక్ష్మి (రావు రమేష్-రేవతి)ల 30వ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేయడం సిద్ధమవుతున్న తరుణంలో.. అనుకోని విధంగా అర్జున్ తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్ లో మరణించడంతో పరిస్థితులు తారుమారవుతాయి. నాయక్ (శ్రీకాంత్) చేసిన బాంబ్ బ్లాస్టింగ్ కేసు, అర్జున్ మెడకి చుట్టుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ అర్జున్ ఫ్యామిలీని నాయక్ ఎందుకు టార్గెట్ చేస్తాడు, సిటీ బాంబ్ బ్లాస్ట్స్ కి అర్జున్ కి ఏంటి సంబంధం? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “యుద్ధం శరణం” చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : లవర్ బోయ్ ఇమేజ్ కలిగిన నాగచైతన్య ఇంటెన్స్ యాక్టింగ్ తోనూ అలరించగలనని “సాహసం శ్వాసగా సాగిపో” చిత్రంతోనే ప్రూవ్ చేసుకొన్నాడు. “యుద్ధం శరణం”లో సగటు యువకుడిగా అర్జున్ పాత్రను సునాయాసంగా పండించాడు. నటన పరంగా పరిణితి చెందాడనే చెప్పాలి. అయితే.. ఎమోషనల్ సీన్స్ విషయంలో జాగ్రత్తపడాల్సి ఉంది. అండర్ వరల్డ్ మాఫియా లీడ్ నాయక్ పాత్రలో నెగిటివ్ రోల్ లో శ్రీకాంత్ ఆశ్చర్యపరచడం ఖాయం. ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్స్ తో శ్రీకాంత్ తన తోటి హీరో టర్నడ్ విలన్స్ అయిన జగపతిబాబు, అర్జున్ లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేవు. లావణ్య త్రిపాఠి-నాగచైతన్య నడుమ కెమిస్ట్రీ బాగా పండింది. ప్రత్యేకించి పాటలు, డ్యాన్స్ నెంబర్స్ ఏమీ లేకపోయినా.. ఉన్న మాంటేజ్ షాట్స్ లోనే జంట బాగుందనిపిస్తుంది. రావురమేష్, రేవతి మంచి తల్లిదండ్రులుగా రెగ్యులర్ రోల్స్ లో మెప్పించారు. “పోష్ పోరీస్” ఫేమ్ హైందవి ఈ సినిమాలో నాగచైతన్య అక్క పాత్రలో మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకొంది.
సాంకేతికవర్గం పనితీరు : వివేక్ సాగర్ సంగీతం-నేపధ్య సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్స్. సాంగ్స్ అన్నీ మాంటేజ్ లోనే షూట్ చేయడం వల్ల లిరికల్ గా ప్రేక్షకులు పెద్దగా గుర్తుపెట్టుకోకపోవచ్చు కానీ.. నేపధ్య సంగీతం మాత్రం థియేటర్ వీడేంత వరకూ గుర్తుంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం రెండుమూడు హాలీవుడ్ సినిమాల నుండి స్పూర్తి పొందినప్పటికీ.. మన తెలుగు ప్రేక్షకులకు అది కొట్టగానే ఉంటుంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాలోని ఇంటెన్సిటీని ఆడియన్స్ కి ఇంజెక్ట్ చేయడంలో హెల్ప్ అయ్యింది. కలర్ గ్రేడింగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. సెకండాఫ్ లో డార్క్ సీన్స్ కోసం “డోంట్ బ్రీత్” సినిమాలోని నైట్ ఎఫెక్ట్ షాట్స్ వాడడం వరకూ బానే ఉంది కానీ.. ఔట్ పుట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే ప్రేక్షకుడికి మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కలిగేది.
ఇలా ఇన్ని టెక్నికల్ ప్లస్ పాయింట్స్ ఉన్న “యుద్ధం శరణం” సినిమాకు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవే కథ-కథనం. ప్రెజంట్ జనరేషన్ లో “డ్రోన్” టెక్నాలజీ గురించి తెలియనివారుండరు. అలాంటిది హీరో క్యారెక్టర్ కొత్తగా డ్రోన్ తయారు చేయడం కోసం తెగ పాట్లు పడుతుండడమేంటో అర్ధం కాదు, పోనీ కనిపెట్టిన డ్రోన్ లో కొత్తగా ఏమైనా ఉందా అంటే మన టీవి చానల్స్ వాళ్ళు కవరేజ్ కోసం వాడే డ్రోన్ లాగే ఉంటుంది. ఇక “తల్లిదండ్రులను చంపిన విలన్ అండ్ గ్యాంగ్ ను హీరో మట్టుబెట్టడం” అనే కాన్సెప్ట్ తో మన తెలుగులో ఇప్పటికే వందకుపైగా సినిమాలోచ్చాయి. ఆ వందల సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుంది కానీ.. కొత్తదనం కనిపించదు. దర్శకుడు కృష్ణ ఎక్కువగా ఇంగ్లీష్ సస్పెన్స్ నవల్స్ చదివి క్యారెక్టర్స్ ను డిజైన్ చేసుకొన్నాడనే విషయం తెలుస్తుంది. అలాగే.. స్క్రీన్ ప్లే విషయంలో కూడా ఏదో ప్రేక్షకుడ్ని కన్ఫ్యూజ్ చేసి ఎగ్జైట్ చేద్దామని ప్రయత్నించిన “వైస్ వెర్సా” స్క్రీన్ ప్లే బెడిసికొట్టింది. దర్శకుడి అపరిపక్వత అందుకు కారణం.
విశ్లేషణ : మేకింగ్ పరంగా వంకలు పెట్టడానికి వీలు లేని “యుద్ధం శరణం” చిత్రాన్ని నాగచైతన్య ఇంటెన్స్ యాక్షన్ కోసం, వివేక్ సాగర్ బ్రిలియంట్ వర్క్ కోసం ఒకసారి చూడొచ్చు. అయితే.. 80ల కాలంనాటి కథ-కథనాలను కాస్త చూసీ చూడనట్లు వదిలేయాలి. ఓవరాల్ గా నాగచైతన్యకి ఈ చిత్రం ఒక డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు.
రేటింగ్ : 2.5/5