సినిమాలో ఎన్ని కష్టాలు ఉన్నా.. ఎన్ని ట్విస్ట్ లున్నా చివరికి సుఖాంతం అవ్వాలి. ప్రేక్షకుడు థియేటర్ నుంచి నవ్వుతూ బయటికి రావాలి. ఇలా ఉంటే సినిమా విజయవంతం అవుతుంది. లేకుంటే ఆ సినిమా ఫెయిల్ అవుతుంది… ఇటువంటి సెటిమెంట్స్ సినీ పరిశ్రమలో చాలామందికి ఉండేది. ఆ నమ్మకాలను కొన్ని సినిమాలు బద్దలు కొట్టాయి. విషాదాంతంలోను విజయం సాధించి రికార్డు సృష్టించాయి. ఆ సినిమాలపై ఫోకస్..
1. కంచెరెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగె ఓ ప్రేమకథను క్రిష్ వెండితెరపై వినూత్నంగా ఆవిష్కరించారు. ఇందులో హీరో హీరోయిన్స్ ఇద్దరూ చనిపోయి ఆడియన్స్ తో కంటతడి పెట్టించారు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించి అభినందనలు అందుకున్నారు.
2. ఒక మనసుమెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నిహారిక చేసిన మొదటి చిత్రం “ఒక మనసు” అందరి మనసులు గెలుచుకుంది. ఇందులో నిహారిక చివర్లో చనిపోవడం ప్రతి ఒక్కరి హృదయాలను మెలిపెట్టింది.
3. గీతాంజలిప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన చిత్రం గీతాంజలి. అక్కినేని నాగార్జున, గిరిజ హీరోహీరోయిన్స్ గా నటించారు. వీరిద్దరికి క్యాన్సర్ పెట్టి.. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఏదో తెలియని బాధని కలిగించారు. థియేటర్ నుంచి కళ్ళు తడవకుండా బయటికి వచ్చే ఆడియన్స్ ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
4. మాతృదేవోభవ1993 లో విడదలైన మాతృదేవోభవ ఊహించని విజయం సాధించింది. ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన ప్రతి ఒక్కరిని ఏడిపించింది.
5. సాగర సంగమంకమల్ హాసన్ నటనకు ఓ చిన్న ఉదాహరణ సాగర సంగమం మూవీ. ఇందులో కమల్ క్లైమాక్స్ లో చనిపోవడం.. మిత్రుడి పార్ధివదేహంపై వాన చినుకులు పడకుండా శరత్ కుమార్ ప్రయత్నించే క్షణంలో ఎంత ఆపిన కన్నీళ్లు ఆగవు.
6. గమ్యంగమ్యం సినిమా పేరు చెప్పగానే హీరో హీరోయిన్ కంటే ముందు అందరికీ గాలి శీను పాత్రే గుర్తుకొస్తుంది. మొదటి నుంచి నవ్వించిన ఈ పాత్ర చివరికి చనిపోవడం.. కలిచి వేసింది. అదే అంశం సినిమాకి కలిసి వచ్చింది.
7. చక్రంస్టార్ హీరో ప్రభాస్.. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన సినిమా చక్రం. ఇందులో ప్రభాస్ క్యాన్సర్ తో చనిపోవడం చూపించకపోయినా.. తండ్రి ఆ విషయాన్నీ చెప్పినప్పుడు.. కళ్ళల్లో నీళ్లు తెలియకుండా వచ్చేస్తాయి.
8. ఓయ్చిన్నప్పుడు తన నటనతో కన్నీళ్లు తెప్పించిన షామిలి.. హీరోయిన్ గా మారినా ఏడిపించడం ఆపలేదు. ఓయ్ సినిమాలో హీరోగా నటించిన సిద్ధార్ధ్ తో పాటు ప్రతి ప్రేక్షకుడిని ఏడిపించింది.
9. వేదంక్రిష్ తెరకెక్కించిన వేదం చూస్తుంటే ఇంట్లో కిటీకీలోంచి బయట జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్లు ఉంటుంది. ప్రతి సన్నివేశంలోనూ జీవం ఉంటుంది. చివరికి మనోజ్, అల్లు అర్జున్ పాత్రలు ప్రజల కోసం చనిపోవడం ఎంత కఠిన హృదయాన్ని అయినా కరిగిస్తుంది.
10. 7/G బృందావన్ కాలనీసెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ద్విభాషా ప్రేమ కథా చిత్రం 7/G బృందావన్ కాలనీ. ఇందులో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. చివర్లో సోనియా అగర్వాల్ పాత్ర ప్రమాదంలో చనిపోవడం విషాదాన్ని నింపింది. అయినా ఈ చిత్రాన్ని యువతీయువకులు మళ్ళీ మళ్ళీ చూసి హిట్ చేశారు.