Gangotri: 20 ఏళ్ళ ‘గంగోత్రి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

(Gangotri) దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసి తన పేరును ఓ బ్రాండ్ గా మార్చుకున్నారు. అందుకే కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహించిన సినిమా అంటే చాలు ఆ సినిమా ఏ జోనర్ కు చెందినది అనే విషయాన్ని పట్టించుకోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన సినిమాలు చూడటానికి ఎగబడేవారు. అందుకే ‘అన్నమయ్య’ ‘శ్రీరామదాసు’ వంటి చిత్రాలు మాస్ సెంటర్స్ లో కూడా 100 రోజులు ఆడాయి. ఇదిలా ఉండగా.. కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ‘గంగోత్రి’ చిత్రం రిలీజ్ అయ్యి ఈరోజుతో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) కె.రాఘవేంద్రరావు గారు తన 98 వ చిత్రమైన ‘శ్రీమంజునాథ’ ని బైలింగ్యువల్ మూవీగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించారు. కానీ ఆ సినిమాకి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే తన 99వ చిత్రాన్ని, 100 వ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేసుకోవాలనుకున్నారు. అయితే తెలుగులో హీరోలెవ్వరూ ఖాళీగా లేకపోతే.. బాలీవుడ్ వెళ్లి గోవిందతో తన 99వ చిత్రాన్ని రూపొందించారు.కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని గోవిందకు ఎప్పటి నుండో ఉన్న కోరిక. ఆ కోరిక అయితే నెరవేరింది కానీ సినిమా మాత్రం అంతంత మాత్రంగానే ఆడింది.

2) అయినప్పటికీ 100 వ చిత్రాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేయాలనుకున్నారు రాఘవేంద్రరావు. అలా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లతో ‘త్రివేణి సంగమం’ అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు.రచయిత చిన్ని కృష్ణని కథ రెడీ చేయమన్నారు.

3) ఈ భారీ మల్టీస్టారర్ ను నిర్మించడానికి అశ్వినీదత్, అల్లు అరవింద్ ముందుకొచ్చారు. కానీ చిరు, వెంకీ, నాగార్జున లతో మల్టీస్టారర్ అంటే భారీ అంచనాలు ఏర్పడతాయి. ఏమాత్రం అటు ఇటు అయినా.. సినిమా ఫ్లాప్ అవ్వడం పక్కన పెడితే.. అభిమానుల మధ్య గొడవలు పెట్టిన దర్శకుడిగా కె.రాఘవేంద్రరావుకి చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఇలాంటి ప్రయత్నం ఎందుకు అని అశ్వినీదత్.. రాఘవేంద్ర రావు కి చెప్పారట.

4) దత్ మాటలతో రాఘవేంద్రరావు కూడా మనసు మార్చుకున్నారు. మరొపక్క దర్శకుడు తేజ తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు కొడుతున్న రోజులు అవి. ఆ రూట్లోనే జయంత్ వంటి స్టార్ డైరెక్టర్లు కూడా ‘ఈశ్వర్’ వంటి తక్కువ బడ్జెట్ లో అయిపోయే సినిమాలు చేస్తున్నారు. అదే రూట్లో కె.రాఘవేంద్రరావు గారు కూడా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. దానికి టైటిల్ ‘గంగోత్రి’ అని ఫిక్స్ చేశారు. ఆ కథను రెడీ చేసే బాధ్యత కూడా చిన్నికృష్ణకే అప్పగించారు.

5) ఈ సినిమాలో నటీనటులను ఎంపిక చేసుకోవడానికి అప్పట్లో టీవీలో కూడా ప్రకటన ఇచ్చారు.

6) ఈ క్రమంలో ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీకి ఈ చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ లభించింది. కానీ నిక్కర్లో నటించడానికి సిగ్గేసి ఆయన ఈ ఆఫర్ కు నో చెప్పాడు.

7) హీరోగా రాంచరణ్ అయితే బాగుంటుంది అని చిరుని అడిగారు. కానీ చరణ్ కి ఇంకా మెచ్యూరిటీ రావాలి అని భావించి ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు చిరు.

8) అటు తర్వాత మోహన కృష్ణ తన అబ్బాయి తారకరత్నని ఈ సినిమాలో హీరోగా పెట్టుకోమని రాఘవేంద్ర రావుని అడిగారు. మరోపక్క అల్లు అరవింద్ కూడా ఈ సినిమా తన కొడుకు అల్లు అర్జున్ ను హీరోగా పెట్టుకోమని రిక్వెస్ట్ చేశారు. ‘గంగోత్రి’ చిత్రానికి అల్లు అరవింద్ కూడా ఓ నిర్మాత . అందువల్ల ఆయన మాట కాదనలేకపోయారు. ఫైనల్ గా అల్లు అర్జున్ ను హీరోగా ఫిక్స్ చేశారు.

9) ఆర్తి అగర్వాల్ చెల్లెలు అధితి అగర్వాల్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఒకప్పటి హీరోయిన్ సీత దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఈ చిత్రంతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ‘గంగోత్రి’ లో ఆమె హీరో తల్లి పాత్ర పోషించింది.

10) 2003 మార్చ్ 28 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదట ఈ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ తర్వాత ఈ సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో గంగోత్రి తీర్థం పోస్తున్నారు అని తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి క్యూలు కట్టారు. టికెట్ చూపించిన వారికి మాత్రమే తీర్థం పోశారు. అలా ఈ సినిమాకి ఆదరణ పెరిగింది. 103 కేంద్రాల్లో 50 రోజులు, 53 కేంద్రాల్లో 100 రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడి సూపర్ హిట్ అనిపించుకుంది.

అదే ఏడాది గోదావరికి పుష్కరాలు రావడంతో ఈ చిత్రంలోని ‘జీవన వాహిని’ అనే పాట గోదావరి జిల్లాల్లో మార్మోగింది. ఎం.ఎం.కీరవాణి సంగీతంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్టే..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus