మాస్, క్లాస్ అని తేడాలేకుండా అందరిని ఆకట్టుకునే నటుడు రజనీకాంత్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ స్టయిల్ అంటే విదేశీయులకు కూడా ఇష్టమే. అందుకే ఆయన సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్లు భారీగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే రజనీ రెమ్యునరేషన్ తీసుకుంటారు. అందుకున్న మొత్తంతో విలాసవంతంగా గడపగల స్థాయి ఉన్నా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. అతని గురించి మీకు తెలియని నిజాలు..
ఆ కారే పంపండి..
సినిమాలో నటించే వారందరిని సమానంగా చూడడం రజనీ అలవాటు. అదే విధంగా తననీ ట్రీట్ చేయమని చెబుతుంటారు. షూటింగ్ లకు రావడానికి తోటి నటులకు ఏ కారు పంపిస్తారో అదే కారుని పంపించమని నిర్మాతలను కోరుతుంటారు. రా.వన్ సినిమాలో నటించినందుకు షారుక్ ఖాన్, రజనీకి బీఎండబ్ల్యు 7 కారును గిఫ్ట్ గా ఇవ్వాలని భావించారు. తాను విలాసవంతమైన కార్లను వాడనని సూపర్ స్టార్ ఆ కారు తీసుకోలేదు.
అదిరే లుక్ సినిమాల్లోనే..
రజనీకాంత్ సినిమాల్లో సూటు బూటుతో స్టైల్ కనిపించినా బయట సింపుల్ గా ఉంటారు. ఇంట్లో షర్టు, లుంగీ తో ఉంటారు. బయటికి వెళ్ళేటప్పుడు ధోతీ, కుర్తా ధరిస్తారు. కనీసం నెరిసిన జుట్టుకి రంగు కూడా వేసుకోరు.
అహం శూన్యం
సూపర్ స్టార్ ని అన్న అహం రజనీకి అసలు ఉండదు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. “దళపతి” షూటింగ్ సమయంలో అరవింద్ స్వామి తెలియక రజనీ రూం లో బెడ్ పైన పడుకున్నారు. ఆ గదిలోకి వచ్చిన సూపర్ స్టార్ నిద్ర పోతున్న అరవింద్ స్వామిని కదిలించలేదు. అదే రూంలో నేల మీద పడుకున్నారు.
అపకారికి ఉపకారి
రజనీ కాంత్ అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఓసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా నటి మనోరమ సూపర్ స్టార్ ని అవమానించింది. అప్పటినుంచి ఆమెను ఎవరూ సినిమాల్లో పెట్టుకోలేదు. ఆ విషయం తెలుసుకున్న రజనీ మనోరమకు తన అరుణాచలం లో అవకాశం ఇప్పించారు. అపకారికి సైతం ఉపకారం చేశారు. అందుకే ఆయనకు శత్రువులే లేరంటారు.
ఆర్భాటం లేకుండా..
తన పుట్టినరోజు వేడుకల్లో జరిగినా తొక్కిసలాటలో అభిమానులు చనిపోవడంతో చెన్నైలో జన్మదినం జరుపుకోవడం రజనీ మానేశారు. కుటుంబ సభ్యుల కోసం ఆర్భాటం లేకుండా ఇంట్లో బర్త్ డే చేసుకుంటుంటారు.
ఆధ్యాత్మికం
రజనీ బాబా భక్తుడు. తన ప్రతి సినిమా విడుదలయ్యాక స్నేహితులతో కలిసి హిమాలయాలకు వెళుతుంటారు. అక్కడ ధ్యానం చేసుకుని, బాబాను దర్శించుకుంటారు. సామాన్యుడిలా పుణ్యక్షేత్రాలను చుట్టి వస్తుంటారు.
అభిమాని కోసం
క్యాన్సర్ బాధిత కుర్రోడు కార్తిక్ కి రజనీకాంత్ ని చూడాలని ఉండేది. ఆ విషయం తెలుసుకుని ఆస్పత్రికి వెళదామని అనుకున్నారు. కానీ కార్తిక్ తండ్రి వద్దని వారించారు. భక్తులే గుడికి వెళ్లాలని కొడుకుని తీసుకుని రజనీ ఇంటికి వెళ్లారు. ఆ అబ్బాయితో గంటపాటు గడిపి, కలిసి భోజనం చేసిన సూపర్ స్టార్ ఫోటోలు కూడా తీసుకున్నారు.
ఆప్త మిత్రుడు
తనని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరమని సలహా ఇచ్చిన బస్ డ్రైవర్ బహదూర్ రజనీకి ఆప్త మిత్రుడు. కండక్టర్ గా పని చేసే కాలం నుంచి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య స్నేహం అలాగే ఉంది. రజనీ ప్రతి సంవత్సరం బెంగళూర్ లోని బహదూర్ ఇంటికి వెళ్లి నాలుగైదు రోజులుండి వస్తుంటారు.
ఆస్తి పేదలకే..
రజనీ కాంత్ తీసుకునే పారితోషికంలో సగభాగం సేవా కార్యక్రమాలకే కేటాయిస్తుంటారు. అంతేకాదు ఆయన తదనంతరం ఆస్తినంతా ” రాఘవేంద్ర పబ్లిక్ చారిటీ ట్రస్ట్” కే చెందుతుందని బహిరంగంగా చెప్పారు.
అదుడా రజనీ
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కి అందరీ ముందు రజనీ థాంక్ యూ చెప్పారు. అందర్నీ ఆశ్చర్యపరిచారు. రోబో ఆడియో రిలీజ్ వేడుకల్లో ఈ సంఘటన జరిగింది. ఆ కార్యక్రమంలో సూపర్ స్టార్ మాట్లాడుతూ “ఈ మధ్య నేను బెంగళూర్ లోని మా అన్నయ్య ఇంటికి వెళ్లా. నన్ను చూసేందుకు పక్కింట్లో ఉండే పెద్దాయన వచ్చారు. నేనింకా సినిమాలో నటిస్తున్నానా ? అని అడిగారు. ఓ సినిమా చేస్తున్నాను, హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అని చెప్పా. “చాలా అందమైన అమ్మాయి. బాగా నటిస్తుంది. మరి హీరో ఎవరు ? అని అడిగారు. నేనే హీరోనని చెప్పేసరికి మౌనంగా ఉండిపోయారు. బయటివాళ్లకు హీరోగా కనిపించని నాతో నటించినందుకు
థాంక్యూ ఐశ్వర్య” అని నిజాయితీగా మాట్లాడి దట్ ఈజ్ రజనీ(అదుడా రజనీ) అని అనిపించుకున్నారు.