సరైన బాక్సాఫీస్ హిట్ లేక సతమతమవుతున్న అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం “12A రైల్వే కాలనీ”. “పొలిమేర” ఫ్రాంచైజ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న అనిల్ విశ్వనాథ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే అందించి షో రన్నర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకుడు. మరి ఈ థ్రిల్లర్ తోనైనా నరేష్ హిట్ కొట్టాడా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: లోకల్ పొలిటీషియన్ టిల్లు (జీవన్) దగ్గర పనిచేస్తూ, తన కాలనీలో ఉండే అమ్మాయిలు, ఆంటీలకు లైన్ వేస్తూ టైమ్ పాస్ చేస్తూ ఉంటాడు కార్తీక్ (అల్లరి నరేష్). తన పక్క ఇంట్లో ఉండే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను ఇష్టపడుతుంటాడు. ఆమెకు తన ప్రేమ వ్యక్తపరిచే ముందే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంటుంది.
దాంతో కార్తీక్ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ మార్పును కార్తీక్ తట్టుకోగలిగాడా? ఏమిటా మార్పు? అనేది తెలియాలంటే “12A రైల్వే కాలనీ” సినిమా చూడాలన్నమాట.
నటీనటుల పనితీరు: అల్లరి నరేష్, వైవా హర్ష, గెటప్ శ్రీను వంటి పెర్ఫార్మర్ల నట ప్రతిభ గురించి ప్రత్యేకంగా పొగడక్కర్లేదు. వాళ్లు ఎప్పుడూ తమ బెస్ట్ ఇస్తారు. అయితే.. ఈ సినిమాలో వాళ్ళతో బలవంతంగా తెలంగాణ యాస మాట్లాడించడం అనేది పెద్ద మైనస్ గా మారింది. ప్రస్తుతం ప్రేక్షకులు అన్నీ మాండలికాల సినిమాలు చూస్తున్నారు. పాత్రలు, వాటి నిర్వాసిత ప్రాంతం బట్టి యాసలో సహజత్వం ఉంటేనే స్వీకరిస్తారు. ఇలా అసహజంగా, అరకొర యాసలు ఇరికించి ఆడియన్స్ కు ఏదో కొత్త అనుభూతి ఇస్తున్నాం అనే భ్రమ నుండి దర్శకరచయితలు అర్జెంటుగా బయటపడాలి. మొన్న వచ్చిన “మాస్ జాతర” సినిమాలను రవితేజ తెలంగాణ యాస చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఈ సినిమాలోనూ అదే పరిస్థితి.
జీవన్, సాయికుమార్, అనీష్ కురువిల్ల వంటి సీజన్డ్ ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అభిరామి ఈ సినిమాలో సర్ప్రైజ్. నటిగానూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
సాంకేతికవర్గం పనితీరు: భీమ్స్ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. పాటలు పెద్దగా గుర్తుంచుకొనే స్థాయిలో లేకపోయినా.. బీజియం మాత్రం ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేసింది. అయితే.. సౌండ్ డిజైనింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
సీమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా నైట్ షాట్స్ అన్నీ మంచి లైటింగ్ తో బాగా తీశారు. ఇంకాస్త డార్క్ ఫీల్ ఇచ్చి ఉంటే బాగుండేది.
డైరెక్టర్ & ఎడిటర్ నాని చాలా క్రిస్ప్ గా సినిమాని నడిపించాడు. ముఖ్యంగా నాన్ లీనియర్ గా కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసిన విధానం బాగుంది. అయితే.. కథనంలోనే అసలు సమస్య ఉండడంతో నాని పనితనం కానీ, అతడి మార్క్ ఏమిటి అనేది కానీ పెద్దగా ఎలివేట్ అవ్వలేదు.
ఇక ఈ సినిమాకి షో రన్నర్ కమ్ రైటర్ అయిన అనిల్ విశ్వనాధ్ ఎంచుకున్న కోర్ పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కథనాన్ని నడిపించిన విధానంలోనే ఆసక్తి లోపించింది. ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం సాగదీసినట్లుగా ఉంటుంది తప్పితే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడు. ఇక సెకండాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ కూడా ఒకానొక సందర్భంలో ఇంకెన్ని ట్విస్టులురా బాబు అనిపించేలా ఉన్నాయి. రచయితగా ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నా.. కథకుడిగా మాత్రం మెప్పించలేకపోయాడు అనిల్. ఇక మాటల రచయితగా జోకు అని భ్రమలో గ్రౌండ్ లో వైవా హర్షతో చెప్పించిన వాలీ బాల్ జోక్ హేయంగా ఉంది. బిగ్రేడ్ సినిమాల్లో అలాంటి జోక్ ఉంటే పర్లేదు కానీ.. ఇలాంటి కంటెంట్ ఫిలిమ్స్ లో అలాంటి చెత్త పంచులకి, జోకులకు ఏమాత్రం ఆస్కారం ఉండకూడదు.
విశ్లేషణ: ఒక కోర్ పాయింట్ చుట్టూ డ్రామా అల్లుకొని, దానికి కొన్ని ట్విస్టులు యాడ్ చేసి ప్రేక్షకుల్ని అలరిస్తే బాగుంటుంది కానీ.. కథనాన్ని కేవలం ట్విస్టుల కోసం సాగదీస్తూ వెళ్లి చివర్లో ఎన్ని ట్విస్టులు ఇరికించినా.. అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు ఆ ట్విస్టులకు ఎగ్జైట్ అవ్వడం అటుంచి.. అసలు సంబంధం లేకుండా ఎందుకు ఇవన్నీ ఇక్కడ ఇరికించారు అనే భావనకి వచ్చేస్తాడు. రచయిత అనిల్ కానీ, దర్శకుడు నాని కానీ.. ప్రేక్షకుల్ని ట్విస్టులతో అలరించలేక, కథనంతో ఆకట్టుకోలేక చతికిలపడ్డారు.
ఫోకస్ పాయింట్: సినిమాలో ట్విస్టులుండాలి.. ట్విస్టుల కోసం సినిమా కాదు!
రేటింగ్: 1.5/5